అంగన్‌వాడీ ఉద్యోగుల రాస్తారోకో
తిరువళ్లూరు: అంగన్‌వాడీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాస్తారోకోకు దిగిన టీచర్‌లు, సహాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు అంగన్‌వాడీ ఉద్యోగులు, సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు మంగళవారం రాస్తారోకో నిర్వ హించారు. అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం కింద నెలకు రూ.27వేలు ఇవ్వాలని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెలకు రూ.9,500 పింఛన్ ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తిరుపతి–చైన్నె మార్గంలో బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు 90 మందిని అరెస్టు చేసి ప్రయి వేటు వాహనంలో తరలించారు.


