విజయ్ పుదుచ్చేరి పర్యటన రద్దు
సాక్షి, చైన్నె : రోడ్ షోకు అనుమతి ఇవ్వక పోవడంతో పాటూ వర్షాల నేపథ్యంలో తన పుదుచ్చేరి పర్యటనను టీవీకే నేత విజయ్ రద్దు చేసుకున్నారు. అదే సమయంలో త్వరలో సరికొత్త రాజకీయ వ్యూహంతో పుదుచ్చేరిలో విజయ్ అడుగు పెట్టబోతున్నట్టు చర్చ ఊపందుకుంది. వివరాలు.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలి సారిగా పుదుచ్చేరిలో ఈనెల 5 వ తేదీన పర్యటించేందుకు విజయ్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
భారీ ర్యాలీ, రోడ్ షో ద్వారా బహిరంగ సభకు నిర్ణయించారు. అయితే ర్యాలీ, రోడ్ షోకు అనుమతి అన్నది ఇవ్వలేదు. కేవలం బహిరంగ సభకు మాత్రమే అనుమతి ఇచ్చారు.అదే సమయంలో పుదుచ్చేరిలోను వర్షాలు పడుతుండటంతో తన పర్యటనను విజయ్ వాయిదా వేసుకున్నారు. అదే సమయంలో పుదుచ్చేరి సీఎం రంగ స్వామితో టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ బుధవారం భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది.
కొత్త చర్చ
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్– బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సీఎంగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ఉన్నారు. అధికారంలో బీజేపీకి వాటా సైతం ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల రూపంలో రంగస్వామికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. అలాగే, అనేక పథకాలు అమలుకు నోచుకోక పోవడంతో తీవ్ర మనస్థాపంతో పదవిలో కొనసాగుతున్నట్టుగా గతంలో చర్చ సాగింది. తాజాగా విజయ్ రాజకీయ ప్రయాణం పుదుచ్చేరిలోనూ మొదలు కానున్నడంతో ఈ సారి ఎన్నికలలో బీజేపీని పక్కన పెట్టే వ్యూహంతో రంగస్వామి ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. విజయ్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతో టీవీకేతో కలిసి 2026 ఎన్నికలను ఎదుర్కొనేందుకు రంగన్న వ్యూహాలకు పదును పెట్టినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా భుస్సీ ఆనంద్‌ను తనను కలిసేందుకు రంగస్వామి అనుమతి ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ రూపంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న రంగస్వామి తాజాగా రూటు మార్చడం ఖాయం అని పేర్కొంటున్నారు. త్వరలో విజయ్‌తో ఆయన సంప్రదింపులు జరపవచ్చు అని, ఈసారి విజయ్ పర్యటన ఎవ్వరూ ఊహించిన రాజకీయ పరిణామాలతో పుదుచ్చేరిలో సాగవచ్చు అన్న చర్చ జోరందుకుంది.


