5న తెరపైకి అఖండ–2
తమిళసినిమా: బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అఖండ తాండవం–2. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, వైజీ.మహేంద్ర, విజీ, సహ నిర్మాత కోటి పాల్గొన్నారు. ఇది సినిమా కాదు భారత దేశం ఆత్మ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది చైన్నెలోనేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వేర్వేరు కాదని మనది సహోదర బంధం అని తెలిపారు. మద్రాసు తన జన్మ భూమి అని, తెలంగాణ తన కర్మభూమి అని, ఆంధ్రా తన ఆత్మ భూమి అని తెలిపారు. ఎన్టీఆర్ గురువు, దైవం అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటి వరకు నటించిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. అఖండ–2 4వ చిత్రం అన్నారు. ఈ చిత్ర కథ గురించి ఒక్క రోజే చర్చించినట్లు చెప్పారు. ఇది హిందూ సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరానికి తీసుకెళ్లే కథా చిత్రం అని పేర్కొన్నారు.ఈ చిత్రం షూటింగ్‌ను 130 రోజుల్లో పూర్తి చేసినట్లు బాలకృష్ణ చెప్పారు.


