సీట్ల పందేరం?
– డీఎంకేతో టీఎన్‌సీసీ టీం భేటీ
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకేతో సీట్ల పందేరం చర్చను కాంగ్రెస్ మొదలెట్టింది. బుధవారం ఏఐసీసీ నియమించిన టీఎన్‌సీసీ కమిటీ అన్నా అరివాలయంలో సీట్ల చర్చను ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో ఈ కమిటీ భేటీ అయింది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే కాంగ్రెస్‌ల బంధం గురించి చెప్పనక్కర్లేదు. వీరి బంధం ప్రతి ఎన్నికలలోనూ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2026 ఎన్నికలలో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగే దిశగానే మొగ్గు చూపుతోంది. అనేక ప్రచారాలు, పుకార్లు బయలు దేరినా డీఎంకే కూటమిలోనే కాంగ్రెస్ కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తాజాగా డీఎంకేతో కూటమి బంధం పదిలం చేసుకోవడంతో పాటుగా ముందుగానే సీట్ల పందేరం ముగించే విధంగా ఏఐసీసీ పెద్దలు ఓ కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ ఇప్పటికే టీఎన్‌సీసీ నేతలతో పలుమార్లు సమావేశమైంది. డీఎంకేతో చర్చించాల్సిన అంశాల గురించి సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు డీఎంకే 25 సీట్లు ఇవ్వగా ఇందులో 18 చోట్లే గెలిచారు. ఈ స్థానాలు డీఎంకే మళ్లీ ఇచ్చేనా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో తమకు ఈసారి రెట్టింపు సీట్లు ఇవ్వాలని, అధికారంలో వాటా ఇవ్వాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు నినదిస్తూ వస్తున్నారు.
స్టాలిన్‌తో భేటీ
తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదనక్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్‌ఆళ్వాలు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసనసభా పక్ష నేత రాజేష్‌కుమార్ బుధవారం డీఎంకే కార్యాలయం తేనాంపేటలోని అన్నా అరివాలయంలో అడుగు పెట్టారు. డీఎంకే నేతల నెహ్రూ, ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్‌లు ఈ కమిటీకి ఆహ్వానం పలికారు. అర్ధగంటకు పైగా వీరి భేటీ జరిగింది. అనంతరం మీడియాతో సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ డీఎంకేతో సంతృప్తికరంగానే భేటీ జరిగిందన్నారు. తమ కమిటీలోని వారంతా సంతృప్తికరంగానే ఉన్నారని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. వదంతులు, ప్రచారాలు మాత్రం వద్దు అని అన్నీ సజావుగానే సాగుతాయని వ్యాఖ్యానించారు.


