మద్రాసు ఆర్ట్ ఉత్సవానికి శ్రీకారం
సాక్షి, చైన్నె: మద్రాసు ఆర్ట్ వీకెండ్ సాంస్కృతిక ఉత్సవాలు చైన్నెలో బుధవారం ప్రారంభమయ్యాయి. నుంగంబాక్కం తాజ్ కోరమండల్ వేదికగా ఐటీశాఖ మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, సినీ దర్శకుడు మణిరత్నం ఈ ఉత్సవాలను ప్రారంభించారు. దక్షిణాది నుంచి సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడం, కళలు, సంస్కృతిని చాటే విధంగా ఉత్సవం జరగనున్నది. ఈ ఏడాది మద్రాసు గతాన్ని గుర్తు చేస్తూ, అనే అంశంతో సాంస్కృతిక ఉత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జరగనన్నాయి. వారసత్వ మైలురాళ్లను తిరిగి కళ్లకు కట్టే విధంగా కళాకారులు, వాస్తు శిల్పులు, డిజైన్లను కొలువు దీర్చారు. అలాగే, చరిత్రను రీమిక్స్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని మద్రాసు ఆర్ట్ వీకెండ్ సంస్థ వ్యవస్థాపకురాలు ఉపాసన అస్రానీ తెలిపారు. చైన్నె గురించి అవగాహనను ప్రేరేపించే విధగా కథలు, సృజనాత్మక అంశాలు, ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రదర్శనకు చర్యలు తీసుకున్నామని వివరించారు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, సాంస్కృతిక సంభాషణనుమరింత విస్తరించడం, అసాధారణమైన సృజనాత్మక ప్రతిభను వెలుగులోకి తీసుకు రావడం స్ఫూర్తిదాయంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో చైన్నెలోని యూఎస్ కాన్సుల్ జనరల్ క్రిష్టోఫర్ హేడ్జెస్, సామాజిక వ్యవస్థాకుడు వైద్యనాథన్ తదితరులు పాల్గొన్నారు.


