మహాదీప దర్శనానికి పోటెత్తిన భక్తజనం
తిరుత్తణిలో..
తిరుత్తణి: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా పచ్చిబియ్యం కొండపై 500 అడుగుల ఎత్తులో మహాదీపాన్ని హారంహర నామస్మరణతో భక్తులు దర్శించారు. తిరుత్తణి ఆలయంలో కార్తీకమాసం కృత్తిక సందర్భంగా బుధవారం ఉదయం మూలవర్లకు విశేష అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచంతో అలంకరించారు. కావడి మండపంలో శ్రీవళ్లి, దేవసేన సమేత ఉత్సవర్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేపట్టారు. కార్తీక దీపం సందర్భంగా తమిళనాడు, ఆంధ్రాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఆలయంకు పోటెత్తారు. రూ. 100 క్యూలో 2 గంటలు, సర్వ దర్శనం మార్గంలో మూడు గంటల పాటు వేచివుండి స్వామి దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో కొండ ఆలయ మాడ వీధులు కిటకిటలాడాయి. ముందుగా ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో మాడ వీధిలో కొలువుదీరగా, తాటిచెట్టుపై ఆలయ ప్రదాన అర్చకులు నెయ్యి దీపం వెలిగించగా ఆలయంకు పశ్చిమ దిశలోని పచ్చిబియ్యం కొండపై 500 అడుగుల ఎత్తులో 150 కేజీల నెయ్యితో మహాదీపం వెలిగించారు. ఈ సందర్భంగా మహాదీప దర్శనంను హారంహర నామస్మరణతో భక్తులు తిలకించి స్వామిని దర్శించి పరవశం చెందారు. కార్తీక దీపం వేడుకల ఏర్పాట్లను ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ఆలయ చైర్మన్ శ్రీధరన్ సహా పాలక మండలి సభ్యులు చేపట్టారు.
రెండు గంటల పాటు ఆలయం మూసివేత
కార్తీక దీపోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు క్యూలో వేచివున్న క్రమంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటల పాటు స్వామికి అభిషేక పూజల కోసం భక్తులకు దర్శన భాగ్యం రద్దు చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆలయం రెండు గంటల పాటు మూసివేయడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వెండి నెమలి వాహనంలో కనువిందుచేస్తున్న శ్రీవళ్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి,
కొండ ఆలయంలో తాటిచెట్టుపై నెయ్యి దీపం వెలిగిస్తున్న ఆలయ అర్చకులు
మహాదీప దర్శనానికి పోటెత్తిన భక్తజనం
మహాదీప దర్శనానికి పోటెత్తిన భక్తజనం
మహాదీప దర్శనానికి పోటెత్తిన భక్తజనం


