తిరుప్పరకుండ్రంలో కార్తీకదీపం హైటెన్షన్
సాక్షి, చైన్నె : మదురై జిల్లా తిరుప్పర కుండ్రంలోని మురుగన్ సన్నిధిలో కార్తీక దీపం వెలిగించే వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. హిందూ సంఘాలు, బీజేపీ వర్గాల ఆందోళనతో హైటెన్షన్ నెలకొనడంతో పెద్ద ఎత్తున బలగాలను మొహరింపజేశారు. వివరాలు.. మురుగన్‌కు రాష్ట్రంలో ఉన్న ఆరుపడై వీడులలో ఒకటిగా తిరుప్పర కుండ్రం ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ పది రోజుల పాటూ కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలమూలల నుంచే కాకుండా, పుదుచ్చేరి, కేరళ , కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా తిరుప్పర కుండ్రం కొండపై ఉన్న స్తూపంపై కార్తీక దీపం వెలిగింపు వ్యవహారం అన్నది అనాదిగా వివాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. సుమారు 30 సంవత్సరాలుగా ఈ వివాదం సాగుతోంది. స్తూపం వద్ద కాకుండా ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద దీపం వెలగించడం జరుగుతోంది. అయితే ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద వెలిగించే దీపం మోక్ష దీపం, అని ఇది కార్తీక దీపం కాదంటూ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని సైతం రంగంలోకి దించారు. వ్యవహారం కోర్టులో సైతం విచారణలో ఉంది. మధురై ధర్మాసనం ఈ ఏడాది ప్రధాన స్తూపంలో దీపం వెలిగించేందుకు ఆదేశించింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆలయం తరపున అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు.
తీవ్ర ఉద్రిక్తత
తాము కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ విచారణకు వస్తుందని ఆలయ అధికారులు ఎదురు చూశారు. అయితే రాలేదు. అదే సమయంలో స్తూపం వద్ద దీపం వెలిగించాలంటూ బుధవారం సాయంత్రం వందలాదిగా హిందూ సంఘాలు, బీజేపీ వర్గాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కంద షష్టి పారాయణాలు చేశారు. అయితే దీపం ప్రధాన స్తూపం వద్ద వెలిగించక పోవడం వివాదానికి దారి తీసింది. దీంతో కొండపైకి వెళ్లి దీపం వెలిగించేందుకు హిందూ సంఘాలు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఓపోలీసు గాయ పడటంతో పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దిగాయి. కొండపైకి వెళ్లిన వారందర్నీ బలవంతంగా కిందకు తీసుకొచ్చారు. వ్యవహారం ముదరడంతో పోలీసు ఉన్నతాధికారులు అంతా తిరుప్పకుండ్రంలో తిష్ట వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదే సమయంలో తిరుప్పకుండ్రంలో 144 సెక్షన్ అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తిరుప్పర కుండ్ర నుంచి తమిళనాడుల మత కల్లోలం సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని డీఎంకే కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపించాయి.
తిరుప్పరకుండ్రంలో కార్తీకదీపం హైటెన్షన్


