క్లుప్తంగా
విద్యుత్‌షాక్‌కు గురై
ఇద్దరి మృతి
అన్నానగర్: విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందారు. ఈఘటన మదురై జిల్లాలోని వాడిపట్టి సమీపంలోని ఒక టీ దుకాణంలో బుధవారం చోటుచేసుకుంది. మదురై జిల్లాలోని వాడిపాటి సమీపంలో దిండిగల్–మదురై హైవేపై ఉన్న ఆండిపట్టి బంగళా వద్ద సోమసుందరం ఒక ఫుడ్‌స్టాల్, టీ స్టాల్ నడుపుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బుధవారం ఉదయం దుకాణంలో అలంకరణ కోసం వేలాడదీసిన సీరియల్ లైట్ల నుంచి టీ షాప్‌లోకి విద్యుత్ ప్రసరించడంతో దుకాణంలో టీ మాస్టర్ బాలగురు (50) విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. ఇది చూసిన దుకాణ యజమాని కుమారుడు రంజిత్‌కుమార్ (35) బాలగురును కాపాడేందుకు ప్రయత్నించాడు. విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మృతదేహాలను పోలీసులు శవపరీక్ష కోసం వాడిపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు పట్టాలపై అదృశ్యమైన నర్సింగ్ విద్యార్థిని
అన్నానగర్: తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలోని గణేష్ నగర్‌కు చెందిన శంకర్ కుమార్తె రమ్య (18). ఈమె మధురైలోని ఒక నర్సింగ్ కళాశాలలో చదువుతోంది. సెలవుల కోసం గ్రామానికి వచ్చిన రమ్య మంగళవారం ఉదయం జిరాక్స్ తీసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం పలు చోట్ల వెతికినా ఆమె జాడ తెలియలేదు. మంగళవారం సాయంత్రం ఇనామ్ మణి యాచ్చి కృష్ణనగర్ రైల్వే టన్నెల్ వంతెన సమీపంలోని పట్టాలపై ఒక మహిళ మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేయగా మృతదేహం రమ్య అని తేలింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కోవిల్‌పట్టి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బస్సులు ఢీ
–10 మందికి గాయాలు
పళ్లిపట్టు: ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం పొదటూరుపేట బస్టాండులో ప్రయాణికులను దింపి డిపోకు వెళ్లింది. అదే సమయంలో తిరువణ్ణామలై దీపోత్సవానికి వెళ్లేందుకు పొదటూరుపేట బస్టాండులో వేచివున్న భక్తుల కోసం వెళుతున్న స్పెషల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్పెషల్ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులతోపాటు పది మందికి గాయాలైయ్యాయి. గాయపడ్డ వారందరిని పొదటూరుపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పొదటూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి హత్య
అన్నానగర్: హొసూర్‌లో బుధవారం తెల్లవారుజామున బైక్‌లో వెళుతున్న యువకుడిని దుండగులు నరికి దారుణంగా చంపారు. కృష్ణగిరి జిల్లా హొసూరు మారుతినగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి నరికిన స్థితిలో మృతిచెంది ఉన్నట్లుగా బుధవారం ఉదయం హొసూర్ హట్కో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతుడు హొసూరులోని అవలపల్లి ప్రాంతం, మరసంద్రం గ్రామానికి చెందిన నారైయనప్ప కుమారుడు హరీష్ (32) అని తెలిసింది. ఇతను బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మారుతినగర్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, పాతకక్షల కారణంగా దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో చోరీ
తిరువళ్లూరు: అమ్మవారి ఆలయ తలుపులు పగులగొట్టి దుండగులు హుండీలోని రూ.లక్ష నగదు, అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన తిరువళ్లూరులో కలకలం రేపింది. తిరువళ్లూరులోని పెరియకుప్పంలో మూంగాత్తమ్మన్ ఆలయం వుంది. రాష్ట్ర దేవదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయ హుండీని మూడు నెలలకు ఒకసారి తెరిచి కానుకలను లెక్కిస్తారు. ఆలయ పూజారి శివకుమార్ మంగళవారం రాత్రి 8 గంటలకు యథావిధిగా ఆలయాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచేందుకు రాగా, అప్పటికే హుండీ తాళాలు పగులగొట్టి ఉండడం చూసి షాక్‌కు గురయ్యాడు. ఆలయం లోపలికి వెళ్లి చూడగా హుండీలోని నగదు, అమ్మవారి నగలు మాయమైనట్టు గుర్తించి టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


