క్రీడలపై ఆసక్తి చూపాలి
తిరువళ్లూరు: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని ఆవడి కమిషనర్ కె.శంకర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్‌లోని ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బాల, బాలికల ఫోరం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.హెచ్‌సీఎల్ టెక్నాలజీ అనుబంధ సంస్థ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధుల సాయంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్రంథాలయం, మొదటి అంతస్తులో క్రీడా పరికరాలతో కూడిన మినీజిమ్‌ను ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన అనంతరం కమిషనర్ శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు సెల్‌ఫోన్, టీవీలకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని కోరారు. క్రీడల వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత పెరిగి చెడు అలవాట్లకు దూరంగా వుండొచ్చన్నారు. క్రీడల కోటాలో ప్రభుత్వం ఉద్యోగం కూడా సాధించవచ్చన్నారు. ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో బాల, బాలికల ఫోరం తరఫున క్లబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆవడి డిప్యూటీ కమిషనర్ ఫిరోజ్‌ఖాన్ అబ్దుల్లా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జీకే కృష్ణ, జాతీయ హాకి క్రీడాకారిణి ఇస్సాబెల్లా, హోప్ ఫౌండేషన్ రీజినల్ డైరెక్టర్ మలర్‌విళి పాల్గొన్నారు.


