విస్తృతంగా వైద్య శిబిరాలు
సాక్షి, చైన్నె : ప్రస్తుత తరుణంలో నలం కాక్కుం స్టాలిన్ ( స్టాలిన్ హెల్త్ కేర్)శిబిరాలను విస్తృతం చేయడానికి అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆరోగ్య శాఖనేతృత్వంలో అన్ని రకాల వైద్య సేవలను ప్రజలముంగిటకు తీసుకెళ్లే విధంగా స్టాలిన్ హెల్త్ కేర్ శిబిరాల ఏర్పాటుకు ఆగస్టులో ప్రభుత్వం శ్రీకారం చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇందు కోసం రూ. 13.58 కోట్లు నిధి కేటాయించారు. మొబైల్ సేవలతో కుగ్రామాలకు సైతం మెరుగైన వైద్యం తీసుకెళ్లే విధంగా లక్షలాది మందికి ఉపయోగకరంగా ఈ శిబిరాలు మారాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక రోగులు, గుండె సంబంధిత రోగులు, గర్భిణీ , పాలిచ్చే తల్లులకు , పిల్లలు, దివ్యాంగులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉపయోగకరంగా ఈ శిబిరాలను విస్తృతం చేశారు. 9,86,732 మంది ఈ శిబిరాల ద్వారా ప్రయోజనం పొందారు. ఈ హెల్త్ కేర్ పథకంపై సచివాలయంలో సీఎం స్టాలిన్ అధికారులు, ఆరోగ్యమంత్రి ఎం.సుబ్రమణియన్ తదితరులతో సమీక్షించారు. శిబిరాలు జరిగే ప్రదేశాలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మెరుగు పరచాలని ఈసందర్భంగా సీఎం ఆదేశించారు.శిబిరాలను మరింత వేగవంతం చేయాలని, తగినంత మంది స్వచ్ఛంద సేవకుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. శిబిరాల నిర్వహణ గురించిన సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేసే విధంగా ఆయా గ్రామాలలో చర్యలు విస్తృతం చేయాలని, వ్యాధులు నిర్ధారించ బడ్డ వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌మురుగానందం, ఆరోగ్య శాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


