ఎస్‌ఐఆర్ దరఖాస్తుల స్వీకరణ
తిరువళ్లూరు: ఎస్‌ఐఆర్ దరఖాస్తులను సకాలంలో పంపిణీ చేసి గడువులోపు వందశాతం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన బీఎల్‌ఓలను తన కార్యాలయానికి పిలిపించిన కలెక్టర్ వారికి సర్టిఫికెట్‌లను అందించి అభినందించారు. ఎన్నికల జాబితాలో సవరణలు, మార్పులు చేర్పులు, మృతిచెందిన వారి పేర్లు తొలగింపు సహా వేర్వేరు ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐఆర్ దరఖాస్తులను ఎన్నికల సంఘం పంపిణీ చేసింది. నవంబర్ నాలుగున ప్రారంభమైన శిబిరం డిసెంబర్ నాలుగు వరకు జరుగుతుందని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ దరఖాస్తులను పంపిణీ చేసి సంబంధిత ధరఖాస్తులను ఓటర్లు పూర్తి చేసిన తరువాత వాటిని కలెక్ట్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వుంది. అయితే ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంతో మరోవారం పొడిగించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఈనెల 11 లోపు పూర్తిచేయాలని ఎన్నికల ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్ దరఖాస్తుల పంపిణీ, ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోపు 20 మంది బీఎల్‌ఓలు పూర్తి చేశారు. వారిని కలెక్టర్ ప్రతాప్ తన కార్యాలయానికి పిలిపించి అభినందించి సర్టిఫికెట్‌లను అందజేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించినట్టు ఆయన కలెక్టర్ అభినందించారు.


