కొంబు సీవి విడుదల తేదీ ఖరారు
తమిళసినిమా: ప్రముఖ దివంగత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ వారసుడు షణ్ముగపాండియన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొంబు సీవి. నటుడు శరత్‌కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి తర్ణిక నాయకిగా నటించారు. నటుడు కాళీవెంకట్, కల్కి రాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి పొన్‌రామ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వరుత్తపడాద వాలిబర్ సంఘం, రజనీమురుగన్, సీమరాజా, ఎంజీఆర్ మగన్, డీఎస్‌పీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా కొంబు సీవి చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, బాల సుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీన్ని స్టార్ సినిమాస్ పతాకంపై ముఖేశ్ టి.చెల్లయ్య నిర్మిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టెయినర్ కథాంశంతో కూడిన ఈ చిత్ర టైటిల్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్ వచ్చిందన్నారు. ఇది 1996లో ఉసిలంపట్టి, ఆండిపట్టి ప్రాంతాల్లో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండగ సందర్భంగా తెరపైకి తీసుకు వస్తున్నట్లు యూనిట్ వర్గాలు విడుదల చేసిన పోస్టర్‌లో పేర్కొన్నారు.


