బాలాపురానికి జాతీయ గుర్తింపు
తిరుత్తణి: వర్షపు నీటి పొదుపులో జాతీయ స్థాయిలో బాలాపురం తృతీయ స్థానం సాధించడంతో ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ తెన్నరసును డీఎండీకే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తిరుత్తణిలో డీఎండీకే కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన ఆదివారం సాయంత్రం నిర్వహించారు. తిరుత్తణి నియోజకవర్గం వ్యాప్తంగా నుంచి పార్టీ శ్రేణులు పాల్గొన్న సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ పార్టీ జిల్లా ఎన్నికల ఉప కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే నల్లతంబి పాల్గొని జనవరిలో డీఎండీకే నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో వర్షపు నీటిని ఆదా చేసి మొక్కలు పెంచి, భూగర్భ జలాలు స్థాయిని పెంచడంలో కృషికి ఫలితంగా జాతీయ స్థాయిలో తృతీయ ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ అవార్డు స్వీకరించారు. ఉత్తమ పంచాయతీగా అవార్డుకు కారకుడైన ఆ పంచాయతీ మాజీ సర్పంచ్, మండల డీఎండీకే కార్యదర్శి తెన్నరసును సభలో సన్మానించారు.


