ఆలూరి రామస్వామి పూర్ణావతి ట్రస్ట్ ఆవిర్భావం
–ప్రారంభించిన డాక్టర్ ప్రసాద్ తోటకూర
సాక్షి, చైన్నె: సామాజిక సేవలలో రాణిస్తున్న తెలుగు ప్రముఖురాలు, విద్యావేత్త డాక్టర్ ఏవీ శివకుమారి తన తల్లిదండ్రులైన ఆలూరి రామస్వామి, పూర్ణావతి పేర్లతో ఆలూరి రామస్వామి పూర్ణావతి తెలుగు చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) ఆవరణలో జరిగిన వేడుకలో తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర హాజరై ఈ ట్రస్ట్ లోగో ను ఆవిష్కరించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోడాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్‌ను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. విశిష్ట అతిథిగా ఇన్ కంట్యాక్స్ మాజీ ప్రిన్సిపల్ కమిషనర్ బి.మురళి మాట్లాడుతూ సమాజ సేవలోనే ఆత్మసంతృప్తి ఉంటుందన్నారు. ఆస్కా కార్యదర్శి దిలీప్ కుమార్, తమిళనాడు ప్రభుత్వ మాజీ అదనపు ముఖ్య కార్యదర్శి టి.ప్రభాకర రావులు హాజరై ప్రసంగించారు. ట్రస్టు వ్యవస్థాపకురాలు డాక్టర్ శివకుమారి మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు కారణమని పేర్కొన్నారు. తండ్రి ఆశయాల కోసం ఈ ట్రస్ట్ ద్వారా సమాజనికి సేవ చేయనున్నట్టు, పేద విద్యార్థులకు చేయూత అందించనున్నట్టు వివరించారు. తెలుగు భాషను వ్యాప్తి చేయడం, ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడం, భక్తి కార్యక్రమాలను నిర్వహించడం, భావితరాలకు తెలుగు నేర్పడం, తెలుగు పండుగలు, సంస్క్కతిని, కూచిపూడి కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గాయని అరుణా శ్రీనాథ్, రాజేశ్వరి, తెలుగు ప్రముఖులు జేకే రెడ్డి, కందనూరు మధు, ఆదిశేషయ్య, గొల్లపల్లి ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.


