తిరువళ్లూరు జిల్లాలో 747మి.మీ. వర్షపాతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఆవడి, గుమ్మిడిపూండి, పొన్నేరి, చోళవరం, రెడ్‌హిల్స్ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి, జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోలోని రెడ్‌హిల్స్‌లో 16సెంమీ వర్షపాతం అత్యధికంగా నమోదు కాగా, పళ్లిపట్టు, ఆర్కేపేటలో వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. చోళవరంలో 117మిమీ, పొన్నేరిలో 125మిమీ, రెడ్‌హిల్స్‌లో 161మిమీ, జమీన్‌కొరట్టూరులో 27మిమీ, పూందమల్లిలో 44మిమీ, తిరువేళంగాడులో 9మిమీ, తిరుత్తణిలో 4మిమీ, పూండిలో 20మిమీ, తామరపాక్కంలో 30మిమీ, తిరువళ్లూరులో 29మిమీ, ఊత్తుకోటలో 16మిమీ, ఆవడిలో 71మిమీ వర్షపాతం నమోదైంది. మొత్తానికి 747 మిమీ వర్షపాతం నమోదు కాగా సరాసరిన 49.80 శాతం నమోదైనట్టు తెలిపారు. చాలా ప్రాంతాల్లో వర్షపు నీటితో కలిసి మురికి నీరు ప్రవహించింది. చోళవరం, రెడ్‌హిల్స్, పొన్నేరిలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. సోమవారం పాఠశాలలు యథావిదిగా పని చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షంలో తడుస్తూ రాకపోకలు సాగించారు. కూరగాయలు, పాలను పొన్నేరిలో ఎక్కువ ధరలకు విక్రయించారు. భారీ వర్షం కారణంగా జమీన్‌కొరట్టూరు, పొన్నేరి, రెడ్‌హిల్స్, కడంబత్తూరు, పేరంబాక్కం, పేరండూరు, ఊత్తుకోట, పెద్దపాళ్యం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది.


