రోడ్డు ప్రమాదంలో అత్త, అల్లుడు మృతి
వేలూరు: ఆంబూరు సమీపంలో సోమవారం వేకువజామున నిలిచి ఉన్న లారీని కారు అతి వేగంగా ఢీకొన్న ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అతని అత్త అక్కడికక్కడే మృతి చెందగా బార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కోవై జిల్లా గౌండాంపాళ్యం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దివ్య మోహన్(50) ఇతని భార్య లవ్‌లీ, అత్త రోస్‌లీ(72) ఉన్నారు. రోస్‌లీ అనారోగ్యం క్షీణించడంతో వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆదివారం రాత్రి ముగ్గురూ కారులో బయల్దేరారు. కారును దివ్య మోహన్ నడుపుతున్నాడు. కారు తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని విన్నమంగళం గ్రామం వద్ద వేకుమ జామున 5.30 గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దివ్య మోహన్, అతని అత్త రోస్‌లీ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. లవ్‌లీ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన సహ వాహనదారులు వెంటనే ఆంబూరు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ లవ్‌లీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కారును క్రేన్‌ల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఈ మేరకు ఆంబూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


