డీఎంకే ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఇంట్లో చోరీ
– 300 సవర్ల నగల అపహరణ
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి ఏకేఎస్ విజయ్ ఇంట్లో చోరీ జరిగింది. 300 సవర్ల బంగారు నగలు, నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా కేఎస్ విజయ్ వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంబంధిత అంశాలు, కేంద్ర పెద్దలతో అనుమతులు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈయన మాజీ ఎంపీ కూడా. అలాగే డీఎంకే వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. తంజావూరు కొత్త బస్టాండ్ ఆవరణలోని శేఖరన్ నగర్‌లో ఆయన నివాసం ఉంది. గత నెల 28వ తేదీన ఇంటికి తాళం వేసి నాగపట్నంకు కుటుంబంతోపాటుగా విజయన్ వెళ్లారు. సోమవారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. లోనికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇందులో ఉన్న 300 సవర్ల బంగారాన్ని దుండగులు అపహరించుకెళ్లి ఉన్నారు. సీసీ కెమెరాలలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాధారణంగా ఏకేఎస్ విజయ్ ఇంటి పరిసరాలు సందడిగానే ఉంటాయి. అయితే తాజాగా పథకం ప్రకారం ఎవరో ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునన్న అనుమానంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.


