డిసెంబర్‌లో గగన్‌యాన్ జీ1 ప్రయోగం
– ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్
తిరువళ్లూరు: డిసెంబర్ చివరి నాటికి మానవరహిత గగన్‌యాన్ జీ–1 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తిరిగి తీసుకుని రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్‌టెక్ యూనివర్సిటీలో 15వ బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ అధ్యక్షురాలు రంగరాజన్ మహాలక్ష్మి కిషోర్ అధ్యక్షత వహించగా వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫ్రొఫెసర్ కల్నల్ రంగరాజన్ ప్రారంభోపన్యాసం చేశారు. విశిష్ట అతిథిలుగా రెనాల్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేబషిష్ నెగోయి, అసెంజర్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కెంపన్నా తదితరులు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న నారాయణన్ మాట్లాడుతూ నాసా సింథటిక్ అప్సర్ రాడార్‌ను గతంలో అంతరిక్షంలోకి ప్రయోగించినట్టు వివరించారు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి కక్ష్యలోకి వెళ్లి అధిక రిజల్యూషన్‌తో చాయాచిత్రాలను తీస్తుందన్నారు. ఇందులో ఎల్–బ్యాండ్, ఎస్–బ్యాండ్ సింథటిక్ రాడార్‌లు వున్నాయని, ఎస్–బ్యాండ్‌ను పూర్తిగా భారత్ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందించామన్నారు. వీటి ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, భూపంకాలను కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. భారత్ ద్వారా చంద్రుడిపైకి మానవులను పంపే ప్రణాళిక వుందని, ఇందుకోసం ప్రధానమంత్రి కూడా ఆమోదం తెలిపారని వివరించారు. ఇటీవల స్వీదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని రాకెట్‌లను ప్రయోగించి విజయం సాధించినా, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగిస్తున్నట్టు వివరించారు.


