గోబిలో పళణి బల నిరూపణ..!
సాక్షి, చైన్నె: ఈరోడ్‌జిల్లా గోబి చెట్టి పాళయంలో అన్నాడీఎంకే బలాన్ని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆదివారం బల ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. పెద్దఎత్తున ర్యాలీగా తరలి వచ్చిన బహిరంగ సభలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్‌ను టార్గెట్ చేశారు. గోబి చెట్టి పాళయం నియోజకవర్గం సీనియర్ నేత సెంగొట్టయ్యన్ సిట్టింగ్ స్థానం అన్న విషయం తెలిసిందే. తొమ్మిది సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజాగా ఆయన విజయ్ నేతృత్వలోని టీవీకేలోచేరారు. టీవీకేలో చేరినానంతరం ఈరోడ్‌కు వచ్చిన సెంగొట్టయ్యన్‌కు బహ్మ్రరథం పట్టే ఆహ్వానం లభించింది. ఈ పరిస్థితులలో గోబి చెట్టి పాళ్యంలో సెంగొట్టయ్యన్ చూసి కాకుండా, అన్నాడీఎంకే రెండాకు చిహ్నం చూసే ఓట్లు ప్రజలు వేశారన్నది చాటే విధంగా, తన బలాన్ని చాటుకునే రీతిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి ఆదివారం బల ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. గోబి చెట్టి పాళయంలో బ్రహ్మాండ ర్యాలీ నిర్వహించారు. ప్రజా చైతన్య యాత్రను మళ్లీ మొదలెట్టే విధంగా ఆదివారం సాయంత్రం దూసుకెళ్లారు. ఆయనకు మేట్టుపాళయం ఎమ్మెల్యే సెల్వరాజ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అభిమాన సందోహం బ్రహ్మరం రథం పట్టారు. అయితే, గోబి నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ద్వారా పళణిస్వామి తన బలాన్ని చాటుకునే పనిలో పడ్డారంటూ సెంగొట్టయ్యన్ మద్దతుదారులు విమర్శలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. అదేసమయంలో గోబి చెట్టి పాళయం వ్యాప్తంగా సెంగొట్టయ్యన్‌కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే వర్గాలు పోస్టర్లు హోరెత్తించడం గమనార్హం. తన బలాన్ని చాటుకునే విధంగా బహిరంగ సభలో దూసుకెళ్లిన పళణిస్వామి సెంగొట్టయ్యన్‌ను టార్గెట్ చేసి విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టారు.


