బలహీన పడ్డ దిత్వా
నాగై, తిరువారూర్, మైలాడుతురైలో భారీ వర్షం ఆరుగురు మృతి మిగిలిన చోట్ల పాక్షికం చైన్నె, శివారు ప్రాంతాలకు తప్పిన గండం అల్లకల్లోలంగా సాగరం.. ఈదురుగాలుల జోరు
శ్రీలంకను అతలాకుతలం చేసిన దిత్వా తుపాన్ పుదుచ్చేరి నుంచి చైన్నె తీరానికి సమీపించే కొద్ది బలహీన పడింది. అయితే కొన్ని జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించారు. మరికొన్ని చోట్ల వరుణ గండం తప్పినా ఈదురు గాలుల ప్రభావం కొనసాగింది. సముద్రంలో అలలు భారీగా ఎగసి పడ్డాయి. అయితే చైన్నె నగరం, శివారు జిల్లాలకు మాత్రం వర్షం ముప్పు తప్పినట్లయ్యింది.
సాక్షి, చైన్నె: దిత్వా తుపాన్ పొరుగు దేశం శ్రీలంకను సర్వనాశనం చేసింది. ఆ దేశంలో ఎటు చూసినా వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీలంక నుంచి భారత్ వైపుగా విమాన , నౌక సేవలు సైతం రద్దు అయ్యాయి. ఇక్కడ దిత్వా రూపంలో వాటిల్లిన నష్టం అపారం. ఇక్కడి నుంచి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన ఈ తుపాన్ తొలుత తమిళనాడులోని నాగపట్నం, తిరువారూర్, మైలాడుతురై జిల్లాలపై తన ప్రభావాన్ని చూపించింది. ఈ జిల్లాలో శని వారం అంతాకుండ పోత వర్షం పడింది. ఆదివారం ఉదయం వరకు వర్షం పడింది. నాగపట్టణంలో 23 సెం.మీ, మైలాడుతురైలో అత్యధికంగా 20 సెం.మీ, సెమ్మనూర్ కోయిల్‌లో 19 సెం.మీ వాన కురిసింది. నాగపట్నం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తిరువారూర్‌లో వేలాది ఎకరాల పంట పొలాలు చెరువులుగా మారాయి. ఈ మూడు జిల్లాలో 1.60 లక్షల ఎకరాల పంట పొలాలు నాశనమైనట్టు తేలింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం, మండపం పరిసరాలను సైతం వర్షం ముంచెత్తింది. వర్షం దాటికి విద్యుదాఘాతానికి, గోడ కూలి, గుడిసెలు కూలి ఆరుగురు మరణించారు. అయితే అధికారిక లెక్కల మేరకు ముగ్గురే మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 91 గొర్రెలు మరణించాయి. ఈక్రమంగా దిత్వా తుపాన్ ఆదివారం ఉదయం ఉత్తర దిశలో పయనిస్తూ పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లింది. ఈ సమయంలో కడలూరు, విల్లుపురం, పుదుకోట్టై జిల్లాలలో భారీవర్షాలు పడుతాయని ఎదురు చూశారు. అయితే సముద్ర తీరంలోని గ్రామాలలో మాత్రమే ప్రభావం కనిపించింది. విల్లుపురం జిల్లా మరక్కానంలోని 3 వేల ఎకరాల ఉప్పు మడులు సముద్రంలో కలిసినట్టుగా పరిస్థితి నెలకొంది. ఇక, పుదుచ్చేరిని ముంచెత్తే ప్రమాదంతో ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. సముద్ర తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కారైక్కాల్ వరకు వర్షం ప్రభావం అధికంగా కనిపించినా క్రమంగా దిత్వా బలహీన పడే పరిస్థితి నెలకొంది. తొలుత 12 కి.మీ వేగంతో పుదుచ్చేరి వైపుగా దూసుకొచ్చినా, ఆ తదుపరి వేగం క్రమంగా తగ్గడంతో వర్షాలు సైతం తగ్గినట్టైంది. కారైక్కాల్‌లో అత్యధికంగా 19 సెం.మీ వర్షం పడింది.
ఆక్రోశంగా సాగరం
దిత్వా వేగం తగ్గడంతో పాటుగా మేఘాల కరువుతో వర్షాలు ఆశించిన మేరకు ఇతర జిల్లాలలో ప్రభావాన్ని చూపించ లేకుండా పోయింది. చెంగల్పట్టు, చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, రాణి పేట, వేలూరు, తిరువణ్ణామలైలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలతో ముందు జాగ్రత్తలు విస్తృతం చేసి ఉంచారు. అయితే ఉదయం 11 గంటల తర్వాతవర్షం కనుమురుగైంది. భానుడు ప్రత్యక్షమయ్యారు. వర్షం లేకున్నా, ఈదురు గాలులు హోరెత్తాయి. సముద్రంలో అలలు ఆక్రోశంతో ఎగసి పడ్డాయి. బీచ్‌ల వైపుగా జనం వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం. ఆది వారం సెలవు దినం కావడంతో జనం ఉత్సాహంగా తీరం వైపుగా వచ్చి అలలను చూసే పనిలో పడడంతో ఉత్కంఠ నెలకొంది. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించాల్సిన పరిస్థితి. మహాబలిపురం నుంచి చైన్నె కాశి మేడు వరకు అలల తాకిడి మరీ ఎక్కువగా క నిపించాయి. మహాబలిపురం వద్ద 10 నుంచి 12 అడుగుల మేరకు అలలు ఎగసి పడ్డాయి. జాలర్లు పడవలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చిభద్ర పరిచారు. రామేశ్వరంలో అయితే, అలల తాకిడికి అనేక పడవలు ధ్వంసమయ్యాయి. దిత్వా బలహీన పడ్డప్పటికీ క్రమంగా తీరాన్ని సమీపించే కొద్ది తొలుత వాయుగుండం, తదుపరి తీవ్ర అల్పపీడనంగా మారనుది. సోమవారం దిత్వా చైన్నెకు సమీపంలో లేదా, ఆంధ్రప్రదేశ్ సూలూరు పేట సమీపంలో తీరాన్ని సమీపించి మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అంచనావేసి ఉండటం గమనార్హం. ఈదురు గాలుల ప్రభావం కొన్ని చోట్ల 60 నుంచి 70 కి.మీ వేగంతో వీయడం గమనార్హం.
బలహీన పడ్డ దిత్వా
బలహీన పడ్డ దిత్వా
బలహీన పడ్డ దిత్వా
బలహీన పడ్డ దిత్వా
బలహీన పడ్డ దిత్వా
బలహీన పడ్డ దిత్వా


