డెల్టాకు మంత్రుల బృందం
సాక్షి, చైన్నె : మంత్రుల బృందం ఒకటి రెండు రోజులలో డెల్టా జిల్లాలో పర్యటించనున్నట్టు డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్ తెలిపారు. పంట, ఇతర నష్టాలపై పరిశీలించనున్నట్టు వివరించారు. దిత్వా రూపంలో పెను విపత్తు తప్పదన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్‌తో పాటుగా డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఆదివారం ఉదయం నుంచి ఎళిలగంలోని స్టేట్ ఎమర్జన్సీ సెంటర్‌లో తిష్ట వేశారు. ఆయా జిల్లాలలో పరిస్థితులపై దృష్టి పెట్టారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులను తక్షనం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు.
అప్రమత్తంగా ఉన్నాం..
దిత్వా శ్రీలంక ను దాటి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించినప్పటి నుంచి రెండు రోజులలో అత్యధికంగా వర్షం నాగపట్నంలో కురిసిందన్నారు. మొత్తంగా ఇక్కడ 30 సెం.మీ వర్షం పడ్డట్టు ఈసందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయ నిధిస్టాలిన్ వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, జలాశయాలలో 85 శాతం నీటి నిల్వ ఉందన్నారు. విపత్తును ఎదుర్కొనే విధంగా 16 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఆర్మీ బృందాలు నాగపట్నం, తిరువారూర్ తదితర జిల్లాలో తిష్ట వేసి, బాధితులకు సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందన్న ప్రాంతాలలో 1,185 పడవలను సిద్ధం చేసి ఉంచినట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 20 వేల హెక్టార్ల పంట నీట మునిగినట్టు ప్రాథమిక సమాచారం వచ్చిందన్నారు. 26 జిల్లాలు తాము శిబిరాలను ఏర్పాటు చేశామని, వీటిలో సుమారు 2 వేల మంది మాత్రమే ప్రస్తుతం ఉన్నట్టు పేర్కొన్నారు. వీరికి కావాల్సిన అన్ని సౌకార్యాలు చేశామన్నారు. డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరులో వర్షం దాటికి పంట పొలాలు మునిగాయని, పంట వరద పాలైందని సమాచారాలు వచ్చాయని, వీటిని పరిశీలించేందుకు ఒకటి రెండు రోజులలో మంత్రులు బయలు దేరి వెళ్లనున్నారన్నారు. సమగ్ర పరిశీలనతో బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ మాట్లాడుతూ, వర్షాలకు ముగ్గురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇందులో తూత్తుకుడి, తంజావూరులో తలా ఒకరు గోడ కూలి, మైలాడుతురైలో విద్యుదాఘతానికి ఒకరు మరణించినట్టు అధికారిక సమాచారం వచ్చిందన్నారు. ఇతర జిల్లాల నుంచి సమాచారాలు సేకరిస్తున్నామన్నారు. 149 పశువులు మరణించాయని, 234 గుడిసెలు దెబ్బతిన్నట్టు వివరించారు. గాలి ప్రభావం అధికంగా ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. సముద్ర తీరం వైపుగా వెళ్ల వద్దని విన్నవించారు. అలల తాకిడి అధికంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.
అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఉదయనిధి, కంట్రోల్ రూం నుంచి ఫిర్యాదుల స్వీకరిస్తూ..
డెల్టాకు మంత్రుల బృందం


