చైన్నెకు తప్పిన గండం
చైనె, శివారు జిల్లాలను వర్షం ముంచెత్త వచ్చన్న వాతావరణ కేంద్రం సమాచారంతో శనివారం రాత్రంతా అధికారులు కంటిమీద కునుకు లేకుండా వ్యవహరించారు. చైన్నెకు నీరు అందించే రిజర్వాయర్ల నుంచి అధిక శాతం నీటిని బయటకు విడుదల చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో వర్షం పడలేదు. అదే సమయంలో దిత్వా బలహీనం పడడంతో చైన్నె, శివారు జిల్లాలకు పెనుగండం తప్పినట్లయ్యింది. శనివారం రాత్రంతా వర్షం పడ్డప్పటికీ, క్రమంగా వాతావరణం మారింది. ఉదయం భానుడు ప్రత్యక్షం కావడంతో పాటుగా ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరించింది. సాయంత్రం తర్వాత అప్పుడప్పుడు చిరు జల్లులు, గాలి తీవ్రత కొంత ఎక్కువగా ఉండటంతో అర్ధరాత్రి తర్వాత వర్షం పడేనా? అన్న ఎదురు చూపులు ఉన్నాయి. అదే సమయంలో దిత్వా సోమవారం వేకు జామున చైన్నెకు సమీపంలో ప్రయాణించనున్నడంతో పొరుగున ఉన్న తిరువళ్లూరు, రాణి పేటలకు వర్షం అలర్ట్ ఇవ్వడం గమనార్హం. కాగా, ఏటా ఏదో ఒక తుపాన్ రూపంలో చైన్నె నీట మునగడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ ఏడాది దిత్వా తాండవం చేస్తుందని ఎదురు చూస్తే, అది బలహీన పడి తీరం వైపుగా కదలడంతో ఆశించిన మేరకు వర్షాలు చైన్నె, శివారులలో ఈ సారి పడ లేదన్నది అధికారుల వాదనగా ఉంది. ఇక చైన్నె నుంచి రాష్ట్రంలోని వివిధ నగరాలకు రద్దు చేసిన విమాన సేవలు మళ్లీ పునరుద్ధరించారు. శ్రీలంకలో దిత్వా ప్రళయంలో చిక్కుకున్న వారిలో 177 మంది తమిళులను చైన్నెకు సురక్షితంగా తీసుకువచ్చారు.


