ఉద్యోగ భద్రతా చట్టాన్ని అమలు చేయాలి
తిరువళ్లూరు: రాష్ట్రంలోని టీచర్లు, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి ఉద్యోగ భద్రతా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తమిళళనాడు పట్టభద్రుల టీచర్‌ల సంఘం సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. తమిళనాడు పట్టబద్రుల టీచర్‌ల రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోశాధికారి చౌదరి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇళంగోవన్, విశిష్ట అతిధిగా రాష్ట్ర జనరల్ సెక్రెటారీ సోమసుందరం హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమసుందరం మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలులోకి తేవాలన్నారు. సర్వీసు పొడిగింపు కాలంలో 25 శాతం విధిస్తున్న కోతలను నిలిపి వేసి పూర్తి స్థాయి వేతనాన్ని మంజూరు చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, పన్నీర్‌సెల్వం, మలర్‌కన్నన్, కుమరేషన్, ఆరుముగస్వామితో పాటూ రాష్ట్రం నలుమూలల నుంచి సంఘం నేతలు హాజరయ్యారు.


