మహాదీపోత్సవానికి సర్వం సిద్ధం
నేడు మహారథోత్సవం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గజ వాహనంలో ఊరేగిన చంద్రశేఖరుడు
వేలూరు: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 3న జరగనున్న మహాదీపోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. స్థానిక అన్నామలైయార్ శివాలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 3న ఉదయం 4 గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు మహా కొండపై కార్తీక మహాదీపం వెలిగించనున్నారు. అర్ధనారీశ్వరుడి ఆలయం నుంచి ప్రదర్శన ప్రారంభమై బలి పీఠం వద్ద ముగిస్తుంది. ఇక్కడ అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అదే సమయంలో కొండపై మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించేందుకు ప్రభుత్వ ఆవిన్ పాల పరిశ్రమ నుంచి ఇప్పటికే 3,500 కిలోల నెయ్యిని సిద్ధంగా వుంచారు. ఈదీపాన్ని 20 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు దర్శించుకోవచ్చు. దీపాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఇప్పటికే తిరువణ్ణామలైకి చేరుకున్నారు.
12 వేల మందితో పోలీస్ బందోబస్తు..
దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారని. దీపోత్సవానికి 12 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సుధాకర్ తెలిపారు. అక్కడక్కడ సిసి కెమరాలు, డూమ్ కెమరాలు వుంచి నిఘా వుంచనున్నట్లు తెలిపారు. కొండపైన దీపోత్సవాన్ని చూసేందుకు ముందుస్తు గుర్తింపు కార్డు పొందిన వారికి మాత్రమే కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు.
గజ వాహనంపై చంద్రశేఖరుడి చిద్విలాసం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం ఉదయం వెండి గజవాహనంలో చంద్రశేఖరుడు భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి పంచ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలను పురష్కరించుకొని 63 నాయన్‌మార్లు ప్రత్యేక అలంకరణల మధ్య కావిళ్లలో ఉంచి భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు
కార్తీక మహా దీపం దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నుంచి రెండు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు. తిరువణ్ణామలైకి వచ్చే తొమ్మిది రహదారులను మూసివేసి తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
నేడు మహారథోత్సవం
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆదివారం ఉదయం పంచ రథోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఒక్కో రథాన్ని ఒక్కోసారి ప్రారంభించాలని తెలిపారు.
మహాదీపోత్సవానికి సర్వం సిద్ధం
మహాదీపోత్సవానికి సర్వం సిద్ధం


