ప్రేమను నిరాకరించిన బాలికపై దాడి
– విద్యార్థి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె కేకేనగర్‌లో ప్రేమించ లేదని బాలికపై దాడి చేసిన కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె ఎం.జి.ఆర్ నగర్ సమీపంలోని జాఫర్‌ఖాన్‌పేట ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక కే.కే.నగర్‌లోని ఓ కాఫీ షాపులో పనిచేస్తోంది. ఆమె ఇంటికి దగ్గరలో నివసిస్తున్న ఓ కళాశాల విద్యార్థిని ప్రేమించింది. అయితే అభిప్రాయభేదాల కారణంగా ఐదు నెలల క్రితం ఇద్దరూ విడిపోయారు. కానీ, ఆ బాలికను మర్చిపోలేక ఆ కళాశాల విద్యార్థి కొన్ని రోజులుగా పనికి వెళ్లే దారిలో బాలికను అడ్డగించి వేధించాడు. అయితే, ఆ బాలిక అతనితో మాట్లాడడానికి నిరాకరించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆ కళాశాల విద్యార్థి బాలిక పనిచేస్తున్న కాఫీ షాపునకు వెళ్లి గొడవ చేశాడు. దీన్ని ఖండించిన బాలికపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి, తన కూతురిపై దాడి చేసిన కళాశాల విద్యార్థిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వడపళని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కళాశాల విద్యార్థిని అరెస్ట్ చేశారు.
3,500 క్యూసెక్కుల నీరు విడుదల
తిరువళ్లూరు: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం మొదలైన క్రమంలో పూండి రిజర్వాయర్ నుంచి సెకనుకు 3,500 క్యూసెక్‌ల నీటిని దిగువకు విడుదల చేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా శనివా రం నుంచి మోస్తరు వర్షం పడుతోంది. దీంతో రిజర్వాయర్‌కు భారీగా ఇన్‌ప్లో పెరగడంతో సెకనుకు 3,500 క్యూసెక్‌ల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదలైన క్రమంలో దాదాపు 30కి పైగా గ్రామాలకు ముంపు హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సైతం హెచ్చరిక జారీ చేశారు.


