గళం జ్వలించాలి! | - | Sakshi
Sakshi News home page

గళం జ్వలించాలి!

Nov 30 2025 7:16 AM | Updated on Nov 30 2025 7:16 AM

గళం జ్వలించాలి!

గళం జ్వలించాలి!

● అనుమతి కోసం పట్టుపట్టండి ● లోక్‌సభ వేదికగా ఢీకి రెడీ ● ఎంపీలకు స్టాలిన్‌ ఉపదేశం

తీర్మానాలు ఇవే..

సాక్షి, చైన్నె :లోక్‌సభలో తమిళ గళం మరింతగా జ్వలింప చేయాలని, వివిధ పథకాలు, ప్రాజెక్టులకు అనుమతి కోసం కేంద్రాన్ని నిలదీయాలని, పట్టుబట్టాలని ఎంపీలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ ఉపదేశించారు. లోక్‌సభ వేదికగా అధికార బీజేపీ కూటమిని ఢీ కొట్టి, తమిళనాడుకు వారు చేస్తున్న ద్రోహాలను బట్టబయలు చేయాలని పిలుపు నిచ్చారు. వివరాలు.. డిసెంబరులో పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అధికార బీజేపీ ఢిల్లీ వేదికగా లోక్‌ సభ, రాజ్య సభలలో ఢీ కొట్టేందుకు ఎంపీలను డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ రంగంలోకి దించారు. ఇందుకోసం చైన్నె తేనాంపేటలోని అన్నా అరివాలయం మురసోలి మారన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో స్టాలిన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల కాలంగా తమిళనాడుపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, ఇక్కడికి రావాల్సిన ప్రాజెక్టులు, పథకాలను మరో రాష్ట్రాలకు బదిలీ చేయించడం, కోయంబత్తూరు, మధురై మెట్రో ప్రాజెక్టులకు అనుమతుల నిరాకరణ, వరిలో తేమ శాతం పెంపునకు అనుమతించక పోవడం, తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వక పోవడం తదితర అంశాల గురించి చర్చించారు. కేంద్రం వైఖరిని ఉభయ సభల వేదికగా ఎండగట్టే విధంగా సమరానికి సిద్ధమయ్యారు. ప్రతి ఎంపీ తన గళాన్ని వినిపించాలని, కేంద్రం తీరును ఎండగట్టడమే కాకుండా, వారు అనుసరిస్తున్న వైఖరి ప్రజలోకి తీసుకెళ్లే విధంగా ఢిల్లీ వేదికగా నిరసన గళం జ్వలింప చేయాలన్న ఆదేశాలను ఎంపీలకు స్టాలిన్‌ చేశారు. అనంతరం ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు.

ఎంపీలతో స్టాలిన్‌ సమావేశం

రాష్ట్ర హక్కులను కాల రాసే విధంగా బీజేపీ పాలకులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. కేంద్రం అడ్డంకులు సృష్టించినా, తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు గత వారం 17 సంస్థలు ముందుకు రావడాన్ని ఆహ్వానించారు. గత కొన్నేళ్లలో 1,016 అవగాహన ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ. 1,140,731 కోట్ల పెట్టుబడులను తీసుకు రావడంలో , 34 లక్షల మందికి ఉపాధి కల్పించడం టీఎన్‌ రైజింగ్‌ పనితీరును అభినందించారు. పారిశ్రామిక అభివృద్ధి, శాంతిభద్రతల నిర్వహణ,ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో అందరికీ అన్నీ నినాదంతో ఆర్థిక ప్రగతి కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్దిని చూసి ఓర్వ లేక ఈర్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నా, అనేక వివక్షలు చూపుతున్నా, గవర్నర్‌ ద్వారా అడ్డంకుల సృష్టిస్తున్నా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో సుపరిపాలనను నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ద్రావిడ మోడల్‌ సీఎం స్టాలిన్‌ను ప్రశంసించారు. బీజెపికి మద్దతు ఇచ్చే సంకీర్ణ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు, పథకాలు అంటూ సాగుతున్న కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.

రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా, అనేక పథకాలను విస్మరిస్తున్న కేంద్రం తీరును ఖండిస్తూ మరో తీర్మానం చేశారు. కొత్త రైలు ప్రణాళికలు లేవు. పదేళ్ల క్రితం ప్రకటించిన వాటికి నిధులు లేవు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 2024–25లో కొత్త రైల్వే లైన్లకు 31,450 కోట్లు అని ప్రకటించి కేవలం రూ. 310 కోట్లు మాత్రమే విడుదల చేయడాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం గురించి ఇది వరకే లోక్‌ సభలో గళం వినిపించామని గుర్తు చేస్తూ, బీజేపీ ప్రభుత్వం తమిళనాడు అన్న రాష్ట్రం పేరునే మరిచినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కోయంబత్తూరు, మధురై మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని పట్టుబడుతూ నినదించనున్నామని ప్రకటించారు.

బీజేపీ మోసాలకు, కుట్రలకు మద్దతు ఇస్తూ తమిళనాడు ప్రజలకు వ్యతిరేకంగా ప్రతి పక్ష నేత పళణిస్వామి వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, ఆయన వ్యవహార తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు.

కోయంబత్తూర్‌, మధురై విమానాశ్రయ విస్తరణ, మధురై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కలైంజ్ఞర్‌ వర్సిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్‌కు గడువు నిర్ణయం విషయంగా ఉభయ సభలలో కేంద్రంపై ఒత్తిడికి నిర్ణయించారు. ఈ వ్యవహారంలో విశ్రమించబోమని స్పష్టం చేశారు. అన్ని పార్టీల ఎంపీలను మద్దతుతో ఈ బిల్లుకు ఆమోదం దిశగా ముందుకెళ్లేందుకు తీర్మానించారు.

వరిలో తేమ శాతం పెంపునకు, రైతులను ఆదుకునేందుకు, వరి కొనుగోలును మరింత విస్తృతం చేసే దిశగా, రైతులకు మద్దతు ధర, ప్రజా పంపిణీ పథకంతో సహా ఇతర సంక్షేమ పథకాలను వెంటనే ఆమోదించే విధంగా డిమాండ్ల నినాదాన్ని ఉభయ సభలలో మార్మోగించేందుకు నిర్ణయించారు.

విద్యలో కాషాయం రంగును పులిమేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. తమిళనాడుకు రూ. 3,548.22 కోట్ల రుణాలను విడుదల చేయాలని పట్టుబట్టారు.

కొత్త చట్టాలు కార్మిక హక్కులను హరించే విధంగా, వారి పై ప్రభావం చూపించకుండా ఉండాలని డిమాండ్‌ చేశారు. కార్మిక జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు.

సాంప్రదాయ చేపల వేట హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడుదలచేయించాలని, పడవలన్నీ స్వాధీనం చేసుకోవాలని నినదించారు.

ఉపాధ్యాయులుగా నియమితులైన , ప్రస్తుతం పనిచేస్తున్న వారు రెండేళ్లలోపు బోధనా అర్హత కలిగి ఉండే విధంగా టెట్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే, లేని పక్షంలో వారు బోధనా విధుల నుంచి తొలగించబడతారనే విషయంగా సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసినట్టు ప్రస్తావిస్తూ, ఉపాధ్యాయులలో నెలకొన్న ఆందోళనలను తొలగించడం, వారికి రక్షణగా నిలిచేందుకు ఎంపీలు తీర్మానించారు.

మహాత్మా గాంధీ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం గ్రామీణ పేదలకు ఒక ముఖ్యమైన పథకం అని పేర్కొంటూ, తమిళనాడుకు ఉపాధి పథకం నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement