ఒకే రోజు ఈరోడ్‌లో ముగ్గురు నేతల ప్రచారం
సాక్షి, చైన్నె : ఈరోడ్‌లో ఆదివారం ఒకే రోజు మూడు పార్టీల నేతల ప్రచారం జరగనుంది. సెంగొట్టయ్యన్ బయటకు వెళ్లిన నేపథ్యంలో తమ పార్టీ బలాన్ని గోబి చెట్టి పాళయంలో చాటే విధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సభకు నిర్ణయించారు. ఈరోడ్‌జిల్లా గోబిచెట్టి పాళయంలో ఈ సభ ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. అదే సయంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పర్యటన కూడా ఈరోడ్ ఉత్తరం పరిధిలో సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ ఉత్తరం ప్రాంతం సైతం గోబి చెట్టి పాళయంకు సమీపంలోని నంబియూరు కొత్త బస్టాండ్ ఆవరణలో ఉండడం గమనార్హం. అదేవిధంగా ఈరోడ్ ఎలుమత్తూరులో డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ కార్యక్రమం కూడా జరగనుంది. ద్రవిడ కళగం నేతృత్వంలో 6వ రాష్ట్రస్థాయి సామాజిక న్యాయ సదస్సు ఇక్కడ జరగనుండడం గమనార్హం. ముగ్గురు నేతల పర్యటనలు పక్క పక్క గ్రామాల పరిధిలోని ప్రాంతాలలో జరుగుతుండడంతో భద్రతా ఏర్పాట్లలో ఈరోడ్ జిల్లా పోలీసుల యంత్రాంగం నిమగ్నమైంది.
పెట్టుబడిదారుల రక్షణలో ఎస్‌ఈబీఐ
సాక్షి, చైన్నె : పెట్టుబడి దారుల రక్షణలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(ఎస్‌ఈబీఐ), నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజ్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌ఈ)లు ఉన్నాయని వక్తలు వ్యాఖ్యానించారు. పుదుచ్చేరిలో హై ఇంపాక్ట్ రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ ఆన్ అవేర్ నెస్‌పేరిట కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడి దారులకు అవగాహన , పెట్టుబడి దారులకు రక్షణ గురించిన అంశాలను విశదీకరించారు. ఎస్‌ఈబీఐ చైర్మన్ తుహిన్ కాంత పాండే, ఎన్‌ఎస్‌ఈ ఎండీ ఆశీష్‌కుమార్ చౌహాన్‌లు మాట్లాడుతూ, పెట్టుబడిదారుల విద్య, రక్షణ, అవగాహన, ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌ఈబీఐ లక్ష్యాలను, భద్రతా పరమైన అంశాలను గురించి విశదీకరించారు. దేశంలో 12.2 కోట్ల మంది ప్రత్యేక రిజిస్టర్డ్ పెట్టుబడి దారులు ఉన్నారని పేర్కొంటూ, ఆర్థికంగా మోసాలను అడ్డుకోవడం, మోసాలకు వ్యతిరేకంగా బలమైన కవచంగా ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఐపీఎస్ అధికారి శృతి ఎస్. యరగట్టి, సెబీ ఎస్‌ఆర్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ సూరజ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తెన్ కాశీనుంచి ప్రత్యేక బస్సులు
కొరుక్కుపేట: ప్రసిద్ధ శబరిమల ఆలయంలో మండల, మకరవిళక్కు క్రతువులు ప్రారంభం కావడంతో, తమిళనాడు నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించారు. ఇందులో భాగంగా, శనివారం (నవంబర్ 29) నుంచి బొంబాయి– తెన్ కాశీ మధ్య ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. శబరిమల సీజన్‌లో తమిళనాడు , కర్ణాటక నుంచి వచ్చే భక్తుల రవాణా అవసరాలను తీర్చడానికి, మొత్తం 67 మార్గాల్లో బస్సు సర్వీసులను నడపడానికి రాష్ట్ర రవాణా సంస్థకు అనుమతి మంజూరు చేయబడింది. దీనివల్ల రెండు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మొదటి దశలో, శుక్రవారం నుండి కోయంబత్తూర్ – పంబా మధ్య ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభించారు. కేవలం తెన్కాసికే కాకుండా, భక్తుల ప్రయోజనం కోసం తమిళనాడులోని పళని, తిరునల్వేలి, కుంబం, చైన్నె వంటి ఇతర ప్రధాన నగరాలకు త్వరలో ప్రత్యేక బస్సులు నడపబడతాయి. అదనంగా, కర్ణాటక నుండి వచ్చే భక్తుల డిమాండ్లకు అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది.
3న టాస్మాక్ ఉద్యోగుల సమ్మె
కొరుక్కుపేట : డిసెంబర్ 3న టాస్మాక్ ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్టు తమిళనాడు టాస్మాక్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ తిరుచ్చిలో ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులు శనివారం తిరుచ్చి సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని తిరుచ్చి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. మద్యం ఖాళీ సీసాలను సేకరించడానికి ఓ ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కోరారు.ఉద్యోగులు ఖాళీ సీసాలను సేకరిస్తే, రాబోయే కొన్ని సంవత్సరాలలో, ఉద్యోగులు వివిధ వ్యాధులు, మానసిక ఒత్తిడితో చనిపోయే పరిస్థితి ఉందన్నారు. ఈమేరకు సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.


