కోవైలో ఉత్తరాది ముఠా వీరంగం
● ఒకే రోజు 13 ఇళ్లలోచోరీ ● తుపాకీతో వెంటాడి పట్టుకున్న పోలీసులు
సాక్షి, చైన్నె: కోయంబత్తూరులో ఉత్తరాది దొంగల ముఠా వీరంగం సృష్టించింది. ఒకే రోజు 13ఇళ్లలో చోరికి పాల్పడింది. ఈ సమాచారంతో కోయంబత్తూరు పోలీసులు జల్లెడ పట్టారు. తుపాకీతో వెంటాడి వేటాడి మరి ముఠాలో కొందర్ని పట్టుకున్నారు. ఇందులో ముగ్గురి కాళ్లకు తూటాలు దిగడంతో పోలీసులు ఆస్పత్రిలోచేర్పించి చికిత్స అందిస్తున్నారు. కోయంబత్తూరు శివారులోని గౌండం పాళయంలో తమిళనాడు హౌసింగ్ బోర్డుకు చెందిన 14 అంతస్తుల భవనంలో వెయ్యికిపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులోకి ఉత్తరాదికి చెందిన దొంగలముఠా శుక్రవారం రాత్రి ప్రవేశించి. తాళం వేసిన 13 ఇళ్లలో ఒకే రోజు రాత్రి ఈ ముఠా చోరికి పాల్పడింది. చోరీ సమాచారంతో గౌండం పాళయం పోలీసులు అలర్ట్ అయ్యారు. 13ఇళ్ల నుంచి 56 సవర్ల బంగారం, రూ. 3 లక్షలకు పైగా నగదు, ఇతర వస్తువులు చోరికి గురైనట్టు తేలింది. ఈ ముఠాను పట్టుకునేందుకు రాత్రంతా జల్లెడ పట్టాయి.ఈ ముఠా చోరీ అనంతరం యముత్తూరు వైపుగా వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఇక్కడి కులనత్తుం పాళయంలో ఓ ఇంట్లోకి శనివారం వేకువ జామున ముగ్గురు వెళ్తుండటంతో వారిని చుట్టుముట్టారు. వీరిలో ముగ్గురు పోలీసులపై ఎదురు దాడికి దిగారు. దీంతో ఆత్మరక్షన కోసం తుపాకీకి పని పెట్టారు. ముగ్గురి కాళ్లకు తుపాకీ తూటాలు దిగడంతో వారిని చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ముఠాలో మరి కొందరు సభ్యులు ఉండవచ్చు అన్న అనుమానంతో దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ వస్తున్నారు. గాయపడి ఆస్పత్రిలో ఉన్న ముగ్గుర్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇర్భాన్(45), ఆసీఫ్(48), ఖలీల్(60)గా గుర్తించారు.


