దిత్వా రెడ్ అలర్ట్
న్యూస్‌రీల్
డెల్టా, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో తుఫాన్ ప్రయాణం
చైన్నె, శివారులలోనూ రెండు రోజులు వానలు
రంగంలోకి విపత్తు నిర్వహణ బృందాలు
అధికారులకు సీఎం ముందు జాగ్రత్తలు
ఎలిళగం నుంచి ఏర్పాట్ల పరిశీలన
మెట్రో రగడ
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో దిత్వా తుపాన్ రూపంలో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. డెల్టాలోని జిల్లాల సముద్ర తీరానికి సమీపంలో దిత్వా కదులుతుండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక, చైన్నెలోనూ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం వరకు అనేక చోట్ల భారీ నుంచి మోస్తరుగా వర్షం పడే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, ఇతర జిల్లాల నుంచి సహాయక బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటికే దక్షిణ తమిళనాడు వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. డెల్టాలోని అనేక జిల్లాల్లో డెబ్బ తిన్న పంటలను చూసిన రైతులు కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో దిత్వా తుపాన్ ప్రభావం తమిళనాడుపై అధికంగా పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రభావం దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి, తిరునెల్వేలి, డెల్టా జిల్లాల్లోని పుదుక్కోట్టై, మైలాడుదురై, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు జిల్లాలపై శనివారం అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే, చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ అధిక వర్ష పాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయి.
ఎగసి పడుతున్న కెరటాలు
దిత్వా ప్రభావంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. శుక్రవారం దిత్వా తన వేగాన్ని తగ్గించుకున్నప్పటికీ, శనివారం డెల్టాకు సమీపంలోకి రాగానే, వేగాన్ని పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో శుక్రవారం చైన్నె నుంచి తూత్తుకుడి , రామనాధపురం జిల్లాల వరకు సముద్రంలో అలల తాకిడి కనిపించింది. రామేశ్వరానికి వెళ్లాల్సిన అన్ని రైళ్లను మండపం వరకే పరిమితం చేశారు. కెరటాల జడి నేపథ్యంలో సముద్ర తీరంలోకి వెళ్ల వద్దంటూ ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తగా జాలర్లు పడవలను ఒడ్డున భద్ర పరిచే పనిలో నిమగ్నమయ్యారు. చైన్నెలో లోతట్టు ప్రాంతాలలో ట్రాక్టర్లతో కూడిన మోటారు పంపు సెట్లను సిద్ధంగా ఉంచారు. రిప్పన్ బిల్డింగ్‌లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు చైన్నెలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు సన్నద్ధమయ్యారు.
సన్నద్ధంగా ఉన్నాం: సీఎం స్టాలిన్
దిత్వా తుపాన్ నేపథ్యంలో చైన్నెలోని ఎలిళగంలోని రాష్ట్ర అత్యవసర కంట్రోల్ విభాగం నుంచి 14 జిల్లాల కలెక్టర్లతో సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఆయా జిల్లాలో చేపట్టిన ముందు జాగ్రత్తలను సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్ మురుగానందం, రెవెన్యూ అదనపుముఖ్య కార్యదర్శి సాయికుమార్, విద్యుత్‌శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, మంగత్‌రామ్‌శర్మ, విపత్తు నిర్వహణ అదనపు ముఖ్యకార్యదర్శి పి. అముద పాల్గొన్నారు. మీడియాతో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, శని, ఆదివారాలలో డెల్టాతోపాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాల అలర్ట్‌తో అన్ని ముందు జాగ్రత్తలు విస్తృతం చేసి ఉంచామన్నారు. అన్ని జిల్లాలలో ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగారని వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రత ఉంటుందో గ్రహించి అక్కడి ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నామని, ప్రమాదాలను నివారించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఆయా ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాలకు చేరుకున్నారని, అఽధికారులతో కలిసి ముందుజాగ్రత్త పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రతి పక్ష నేతే రైతులకు తీవ్ర మోసం తలపెట్టారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దిత్వాను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
దిత్వా రెడ్ అలర్ట్
దిత్వా రెడ్ అలర్ట్
దిత్వా రెడ్ అలర్ట్


