మాతోనే జయలలిత వర్సిటీ ప్రగతి
సాక్షి, చైన్నె: జయలలిత పేరిట ఉన్న వర్సిటీపై తాము ఎలాంటి వివక్ష చూపించలేదని, మరింతగా అభివృద్ధి చేశామని సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. జే జయలలిత మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో శుక్రవారం నటుడు శివకుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ను సీఎం ప్రదానం చేశారు. చైన్నెలోని కలైవానర్ అరంగంలో జె జయలలిత మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీ 3వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో ఆ వర్సిటీ చాన్స్‌లర్ హోదాలో సీఎం స్టాలిన్‌తో పాటు మంత్రులు స్వామినాథన్, సుబ్రమణియన్, శేఖర్‌బాబు, ఎంపీలు కళానిధి వీరాస్వామి, మణివాసన్, వర్సిటీ వీసీ డాక్టర్ సౌమ్య, రిజిస్ట్రార్ మాలిని, నటుడు శివకుమార్, చిత్రకారుడు చంద్రు, వర్సిటీ బోర్డు సభ్యుడు పూచ్చిమురుగన్ హాజరయ్యారు. విద్యార్థులకు పతకాలను, డిగ్రీలను సీఎం స్టాలిన్ అందజేశారు. శివకుమార్, చిత్రకారుడు చంద్రులకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ శివకుమార్, చంద్రులకు గౌరవ డాక్టరేట్ అందజేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా కాలంలో శివకుమార్, ఆయన కుమారులు సూర్య, కార్తీ ఇచ్చిన విరాళం గురించి గుర్తు చేశారు.
వివక్ష చూపించ లేదు..
అమ్మయార్ జయలలిత పేరిట ఉన్న ఈ వర్సిటీపై తాము ఎలాంటి వివక్ష చూపించ లేదని, మరింత అభివృద్ధి చేశామని అన్నారు. 2021 తర్వాతే ఈ వర్సిటీకి గొప్ప వైభవం తీసుకొచ్చామని వివరించారు. ఈ వర్సిటీ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు పట్టభద్రులైన వారందరూ రానన్న కాలంలో గొప్పకళాకారులుగా ఎదగాలని పేర్కొంటూ, సంగీత విద్యాంసుడు ఇళయరాజకు ఇటీవల జరిగిన సన్మానం గుర్తుచేశారు. ఈవర్సిటీలో సంగీతం, కళలు, కవిత్వం గురించి విద్యార్థులు అధ్యయనం చేస్తుండడం ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ఈ దిశగా 2026–27లో కవితలు, కళల పరిరక్షణలో కొత్త మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రవేశ పెట్టనున్నామని ప్రకటించారు. వర్సిటీ నిర్వహణ మెరుగుపరచడానికి రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లకు పెంచుతున్నామని ప్రకటించారు. తమిళానికి, తమిళ జాతికి గర్వకారణంగా నిలిచే విధంగా రచనలు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తూ, ఉత్తమ కళలకు, సేవకులకు కలైమామణి వంటి అవార్డులు ఎదురు చూస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
మాతోనే జయలలిత వర్సిటీ ప్రగతి
మాతోనే జయలలిత వర్సిటీ ప్రగతి


