పులికి తోకగా ఉండడమే గౌరవం
● అన్నాడీఎంకే సీనియర్ నేతజయకుమార్
సాక్షి, చైన్నె: ఎలుకకు తలగా ఉండడం కన్నా, పులికి తోకగా ఉండడమే గౌరవం అని అన్నాడీఎంకే సీనియర్ నేత డి.జయకుమార్ అన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఉన్న సెంగొట్టయ్యన్ టీవీకేలో చేరడం గురించి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తన అభిప్రాయాన్ని, తన నిర్ణయాన్ని సెంగొట్టయ్యన్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడున్నా బాగుండాలన్నదే తన అభిప్రాయం అని చెప్పారు. తన వరకు అయితే, ఎలుకకు తలగా ఉండడం కన్నా, పులికి తోకగా ఉండడమే గౌరవంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పులి అన్నాడీఎంకే అని, ఎలుక అనేది ఎవరో మీరే అర్థం చేసుకోండి అంటూ పరోక్షంగా టీవీకేను ఉద్దేశించి చమత్కరించారు. ఎలుకకు తలగా ఉంటే ప్రయోజనం శూన్యం అని ఎద్దేవా చేశారు. మరో సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్ స్పందిస్తూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరితరం కాదన్నారు. 2026లో ఎవరెన్ని జిమ్మికులు, మాయలు చేసినా గెలుపు అన్నాడీఎంకే వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలలో చైతన్యం వచ్చేసిందని, ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
శిరోభారంగా పదవుల భర్తీ
సాక్షి, చైన్నె : రాష్ట్ర కాంగ్రెస్‌లో జల్లా అధ్యక్షులు, ఇతర కార్యనిర్వాహకుల పదవుల భర్తీ అధిష్టానం పెద్దలకు శిరోభారంగా మారింది. అనేక చోట్ల అధ్యక్ష పదవి కోసం గ్రూపుల మధ్య సమరం నెలకొనడంతో ప్రత్యేక కమిటీ వర్గాలు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని జిల్లాల్లో అధ్యక్షులు, ఇతర నిర్వాహకుల పదవుల భర్తీ నిమిత్తం ఏఐసీసీ 33 మంది ప్రతినిధులతో కమిటీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. బృందాలుగా ఏర్పడిన ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే, అనేక చోట్ల అధ్యక్ష పదవులకు సంబంధించి కాంగ్రెస్‌లోని గ్రూపుల మధ్య సమరం నెలకొనడంతో ప్రతినిధులకు శిరోభారంగా మారినట్టు తెలిసింది. డిసెంబర్ మొదటి వారంలోపు పర్యటనను ముగించి జాబితా సిద్ధం చేయడానికి ఈ కమిటీ పరుగులు తీస్తోంది. అదే సమయంలో శుక్రవారం అంబత్తూరులో జరిగిన సమావేశంలోనూ ఉత్తర చైన్నె, కాంచీపురం జిల్లాల అధ్యక్ష పదవుల ఎంపిక కసరత్తులు రచ్చకు దారి తీయడంతో కమిటీ ప్రతినిధులు నివ్వెర పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డీఎంకే పతనమే లక్ష్యం
సాక్షి, చైన్నె: డీఎంకే పతనమే లక్ష్యంగా ముందుకు సాగే కూటమిలో పీఎంకే ఉంటుందని ఆపార్టీ నేత అన్బుమణి వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకేపై ప్రజల్లో ఆక్రోశం రగులుతోందన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ డీఎంకే పాలనలో మహిళలు, యువకులు, కార్మికులు, రైతులు, పారిశ్రామిక వేత్తలు సైతం అష్టకష్టాలు పడుతున్నారని, ఎప్పుడెప్పుడు డీఎంకేను గద్దె దించేద్దామా అనే ఎదురుచూపుల్లో అన్ని వర్గాలు ఉన్నాయన్నారు. ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని, డీఎంకేను గద్దెదించే సమయం ఆసన్నమైందన్నారు. ఈ ప్రయాణంలో ముందుండే కూటమిలో పీఎంకే ఉంటుందని, డీఎంకే పతనమే లక్ష్యంగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాడుతుందా అనేది ఎన్నికల ఫలితాల ఆధారంగానే ఉంటాయని, అంతవరకు వేచి ఉండాల్సిందేనని అన్నారు.
త్వరలో టెర్మినల్ పనులు
సాక్షి, చైన్నె: త్వరలో పరందూరులో విమానాశ్రయ టెర్మినల్ పనులు మొదలు అవుతాయని సలహా కమిటీ చైర్మన్, ఎంపీ టీఆర్ బాలు తెలిపారు. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం శుక్రవారం ఆ విమానాశ్రయ డైరెక్టర్ రాజాకిషోర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో సలహా కమిటీ చైర్మన్ టీఆర్ బాలు, పల్వారం ఎమ్మెల్యే కరుణానిధి, తాంబరం ఎమ్మెల్యే ఎస్‌ఆర్ రాజా, అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించి పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను మీడియాకు టీఆర్ బాలు వివరించారు. అలాగే, మీనంబాక్కం విమానాశ్రయ విస్తరణ పనులకు ఆ పరిసరాలలోని కౌల్‌బజార్, పొలిచ్చలూరు, అనకాపుత్తూరు పరిసరాలలో ఎలాంటి స్థల సేకరణ జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే టెర్మినల్స్ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త విమానాశ్రయం పరందూరులో చేపట్టనున్నామని, త్వరలో ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు వివరించారు. విమానాశ్రయం కోసం 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, 3,700 ఎకరాల ప్రైవేటు భూములను ఎంపిక చేసినట్టు తెలిపారు.


