క్లుప్తంగా
ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పుట్టినరోజు
కొరుక్కుపేట: ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు సంక్షేమ సహాయకాలు అందించారు. తిరువొత్తియూరు సెంట్రల్ ఏరియా కార్యాలయం ప్రారంభోత్సవం మనలి కామరాజర్ సాలైలో జరిగింది. చైన్నె నార్త్ ఈస్ట్ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే మాధవరం ఎస్.సుదర్శనం నేతృత్వంలో ఏరియా కార్యదర్శి 2వ జోన్ కమిటీ అధ్యక్షుడు ఎ.వి.అరుముగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైన్నె జోన్ ఇన్‌చార్జ్ ఎంపీ.రాజా తిరువొత్తియూరు సెంట్రల్ ఏరియా డీఎంకే కార్యాలయాన్ని ప్రారంభించి, ఉదయనిధి స్టాలిన్ పుట్టిన రోజు కేక్‌ను కట్ చేశారు. 1000 మందికి బిర్యానీ అందించారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీ డాక్టర్ కళానిధి వీరసామి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మోహన్, జిల్లా నిర్వాహకులు పాల్గొన్నారు.
చోళుల వెండి నాణెం లభ్యం
అన్నానగర్: కడలూరు జిల్లాలోని పన్రుట్టి సమీపం ఉలుదంపట్టి తెన్పైన్నె నదిలో గురువారం కళాశాల విద్యార్థులు క్షేత్ర పరిశోధన చేస్తుండగా ఒక నాణెం దొరికింది. అది రాజరాజ చోళుల కాలంలో ఉపయోగించిన నాణెం అని తేలింది. పురావస్తు శాస్త్రవేత్త ఇమ్మాన్యుయేల్ ఇలా అన్నాడు. తెన్పైన్నె నదిలో దొరికిన నాణెం రాజరాజ చోళ కాలం నాటి వెండి నాణెం అని గుర్తించారు. ఈ నాణెం బరువు దాదాపు 4.35 గ్రాములు. నాణెం ఒక వైపు దేవనాగరి లిపిలో ‘శ్రీరాజ రాజ’ అనే పేరు ఉందని ఆయన చెప్పారు.
తమిళ సమాఖ్య ప్రారంభం
కొరుక్కుపేట: తమిళ సమాజ రక్షణ ఉద్యమం తరఫున తమిళనాడులోని 18 గిరిజన కుల సంస్థల సంప్రదింపుల సమావేశం చైన్నెలో జరిగింది. ఇందులో తమిళనాడు సత్రియా నాడార్ ఉద్యమ పోషకుడు టి.పద్మనాభన్ కూడా పాల్గొన్నారు. తమిళ కమ్యూనిటీ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ కోఆర్డినేటర్ ఆర్.చంద్రన్ జయపాల్, ఎన్.ఆర్.థానపాలన్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని తమిళుల హక్కులను కాపాడేందుకు, 18 స్థానిక తమిళ కులాలను, వాటి శాఖలను, అనుబంధ కులాలను ఏకం చేయడానికి తమిళ సమాఖ్య అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమిళ కులస్తులు నివశించే ఇతర రాష్ట్రాలన్నింటిలోనూ తమిళులకు రిజర్వేషన్లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనేది సహా వివిధ తీర్మానాలను ఆమోదించారు.
రూ.13లక్షల చోరీ
అన్నానగర్: అచ్చరపాక్కంలో కారు అద్దాలు పగులగొట్టి దుండగులు రూ.13లక్షల 38 వేలు చోరీ చేశారు. చెంగల్పట్టు జిల్లాలోని తిరుక్కల్ కుండ్రం సమీపం నెమ్మేలి ప్రాంతానికి చెందిన షేక్ దౌత్(45). ఇతను గురువారం అచ్చరప్పాక్కం సమీపంలోని అత్తివాక్కం గ్రామంలోని తన ఇంటిని మరొకరికి అమ్మగా వచ్చిన నగదు రూ.13 లక్షల 38వేలను కారులో పెట్టాడు. కొంతసేపటి తర్వాత అతను తిరిగి వచ్చి చూడగా కారు అద్దాలు పగిలి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే కారులో చూడగా కారులో ఉంచిన నగదు రూ.13 లక్షల 38వేలు చోరీకి గురైనట్టు గుర్తించాడు. ఫిర్యాదు మేరకు సంఘటన జరిగిన ప్రాంత సమీపంలోని కిరాణా దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా అచ్చపాక్కం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
93 సవర్ల నగల దోపిడీ
ముగ్గురి అరెస్ట్
అన్నానగర్: వ్యాపారిపై దాడి చేసి 93 సవర్ల బంగారు నగలను దుండగులు దోపీడీ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. చైన్నెలోని ఎగ్కినారు ప్రాంతానికి చెందిన జగదీష్ (34) రాజస్థాన్‌న్‌కు చెందిన వ్యాపారి. ఇతను యానైకౌనిలోని వెంకట్రాయన్ వీధిలో నగల దుకాణం నడుపుతున్నాడు. ఇందులో ఐదుగురికి పైగా పనిచేస్తున్నారు. గత 24వ తేదీన జగదీష్ ఒంటరిగా దుకాణంలో ఉన్నాడు. ఆ సమయంలో బంగారు నాణేలు కొనేందుకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు జగదీష్‌పై దాడి చేసి మత్తుమందు స్ప్రే చేశారు. అతను స్పృహ కోల్పోయాడు. దుకాణంలోని 93 సవర్ల బంగారం, వెండి నాణేలు, రాగి పలకలను దోచుకుని వెళ్లిపోయారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో దుండగులు రాజస్థాన్‌కు చెందిన వారని తెలిసింది. రాజస్థాన్‌న్‌కు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం, ఆరాష్ట్ర పోలీసుల సహాయంతో పాలి జిల్లాలో ఉన్న దుండగులు వినోద్ (33), సర్వన్ గుర్జార్ (19), ఓంప్రకాష్ (23)లను అరెస్టు చేశారు. వారిలో వినోద్ అక్కడ నగల దుకాణం నడుపుతున్నాడు. వారి నుంచి 414.8 గ్రాముల బంగారు నాణేలు, 36 గ్రాముల వెండి నాణేలు, 295 గ్రాముల రాగి పలకలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని శుక్రవారం రైలులో చైన్నెకి తీసుకొస్తున్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
వేలూరు: వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని తెరుంగుమలై గ్రామానికి చెందిన చిన్నపయ్యన్ బార్య కుప్పమ్మాల్(110). వీరికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. వీరందరికీ వివాహం కావడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం చిన్నపయ్యన్ మృతి చెందాడు. దీంతో కుప్పమ్మాల్ మాత్రం ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు వస్తున్న వృద్ధాప్య పెన్షన్‌తో జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నెల రోజులుగా ఈమె అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గురువారం సాయంత్రం ఇంటిలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుమార్తెలు, కుమారులు, బంధువులు ఆమెకు దహనక్రియలు చేశారు.


