వాస్తవ సంఘటనల వెళ్లకుదిర
తమిళసినిమా: కమర్షియల్ అంశాలతో కూడిన చిత్రాల మధ్య వాస్తవ సంఘటనలతో కూడిన కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. సినిమాలపై ప్రేమ, ఫ్యాషన్ ఉంటేనే ఇలాంటి కథా చిత్రాలు రూపొందుతాయి. అలాంటి చిత్రం వెళ్లకుదిర. ఇలాంటి సహజత్వంతో కూడిన చిత్రాలకు అంతర్జాతీయ అవార్డు మరింత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. అలా తెరకెక్కిన వెళ్లకుదిరై చిత్రం ఏకంగా 62 అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, 54 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రంలో చెప్పుకోవాల్సినన విషయాలు చాలానే ఉన్నాయి. దురాశ దుఃఖానికి చేటు అంటారు. అదే విధంగా నిజాయితీ, సేవాభావం ఉంటే ఎక్కడైనా గౌరవంగానే జీవించవచ్చునన్న విషయాలను ఈ చిత్రం చెబుతుంది. ఒక గ్రామంలో తప్పుడు బాటలో పయనించిన ఒక చిన్న కుటుంబ పెద్ద ప్రాణభయంతో ఉన్న గ్రామాన్ని వదిలి తన పూర్వీకులు నివశించిన కొండ ప్రాంతానికి భార్య, కొడుకును తీసుకుని వెళ్తాడు. అక్కడ నిశ్చల మనస్కులైన ప్రజలు వారికి ఆశ్రయం ఇస్తారు. అలా సాఫీగా సాగుతున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి మళ్లీ దురాశ, అక్రమ సంపాదనకు అలవాటు పడతారు. భార్య ఆ ప్రాంత ప్రజలకు తనకు చేతనైన సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూసే ఒక పెద్ద మనిషి భాగోతం బయట పెట్టి మరింత గౌరవాన్ని తెచ్చుకుంటుంది. అదే సమయంలో ఆమె భర్త పయనించే తప్పుడు మార్గం ఆ ప్రాంత ప్రజలకు తెలుస్తుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న పెద్దమనిషిగా చెలామణి అవుతున్న వ్యక్తి ఆ కుటుంబాన్ని అవమాన పరిచి నడిరోడ్డుకు ఈడుస్తాడు. ఆ తరువాత ఆ కుటుంబం పరిస్థితి ఏమిటీ ఎలాంటి కనీస వసతులు లేని కొండ పైనుంచి కిందికి రావడానికి అక్కడి ప్రజలు పడే అవస్థలు, ఆ ప్రాంతాన్ని ప్రజలు వదిలి వెళ్లిపోవడానికి కారణాలు, కొండ పైనుంచి కిందికి రావడానికి రోడ్డు కోసం వారు చేసే పోరాటం నెరవేరిందా తదితర పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం వెళ్లకుదిర. నిజం సినిమా పతాకంపై హరీష్ ఓరి నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి అబిరామి బోస్, విజయకుమార్, రెజిన్, మెలోడి టార్గస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వీరిలో పలువురు రంగస్థల నటులు కావడం విశేషం. చరణ్‌రాజ్ సెంధిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భరత్ ఆశీర్వాగన్ సంగీతాన్ని అందించారు.కాగా ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
వాస్తవ సంఘటనల వెళ్లకుదిర


