18 రోజుల తర్వాత రోడ్డెక్కిన ఆమ్నీ బస్సులు
సాక్షి, చైన్నె: ఇతర రాష్ట్రాలకు తమిళనాడు నుంచి ఆమ్నీ ప్రైవేటు బస్సులు 18 రోజుల తర్వాత శుక్రవారం రోడ్డెక్కాయి. రవాణా మంత్రి శివశంకర్ హామీతో బస్సులను నడిపేందుకు నిర్ణయించామని ఆమ్నీ ప్రైవేటు బస్సుల యాజమాన్య సంఘం నేత అన్బళగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో విధిస్తున్న ప్రత్యేక పన్ను, జరిమానకు వ్యతిరేకంగా ఆమ్నీ ప్రైవేటు యాజమాన్యాలు బస్సుల సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు ప్రైవేటు బస్సులు నిలుపుదల చేశారు. ఎట్టకేలకు యాజమాన్య సంఘాలతో మంత్రి శివశంకర్ శుక్రవారం చర్చించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో బస్సులను రోడ్డెక్కించేందుకు ఆమ్నీ యాజమాన్యాలు నిర్ణయించాయి.


