క్లుప్తంగా
ఆవడిలో మహిళపై దాడి
అన్నానగర్: ఆవడి కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళనాడు తరఫున మావీరార్ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ జరిగింది. వేదికపై లిబరేషన్ టైగర్స్ నాయకుడు ప్రభాకరన్ ఫొటోగ్రాఫ్ ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. అప్పుడు ముగప్పేర్‌కి చెందిన ఒక మహిళ అకస్మాత్తుగా వేదిక పైకి వచ్చి ‘ప్రభాకరన్ బతికి ఉన్నప్పుడు మీరు అతనికి దండ ఎందుకు వేశారు’ అని అడిగి అతనితో వాదించారు. దీని తరువాత వారు ఆమెను వేదికపై నుండి బలవంతంగా దింపి, ఆమెను తొలగించడానికి ప్రయత్నించారు. అప్పుడు కొంతమంది మహిళపై దాడి చేయడంతో కలకలం నెలకొంది. కాపలాగా ఉన్న పోలీసులు వెంటనే ఆ మహిళను రక్షించి అక్కడి నుండి తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో డ్రైవర్ హత్య
అన్నానగర్: ఆవడిలోని కామరాజ్ నగర్ నివాసి ముత్తు(53) ఆటో డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన కార్మికుడు శ్రీనివాసన్(48)తో 23వ తేదీన మద్యం తాగి గొడవ పడ్డాడు. ఆ తర్వాత ముత్తు కోపంతో శ్రీనివాసన్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీని తర్వాత శ్రీనివాసన్ కుమారులు జెబరాజ్, అరుళ్‌రాజ్ రాత్రి అదే ప్రాంతంలో రోడ్డు పక్కన తాగి నిద్రపోతున్న ముత్తుతో వాగ్వాదానికి దిగారు. వారు ఇటుకలతో కూడా దాడి చేశారు. ముత్తు తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయాడు. జెబరాజ్, అరుళ్‌రాజ్ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ముత్తును పొరుగువారు రక్షించి కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై ఆవడి నగర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి జెబరాజ్, అరుళ్‌రాజ్ ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇంతలో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తు శుక్రవారం ఉదయం విషాదకరంగా మరణించాడు. దీని తరువాత ఆవడి పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
12 కిలోల గంజాయి స్వాధీనం
తిరువళ్లూరు: నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న త్రిపుర రాష్ట్రానికి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు రైల్వేస్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయి విక్రయం జోరుగా సాగుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని పోలీసులు అక్కడ ప్రత్యేక నిఘా ఉంచగా, అనుమానాస్పద రీతిలో బ్యాగుతో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువకుడు త్రిపుర రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ హుస్సేన్(25)గా గుర్తించారు. ఇతను ఒడిశా నుంచి రైలులో గంజాయి తీసుకొచ్చి అంబత్తూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. అతడ్ని అరెస్టు చేసి 12 కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పూందమల్లి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.
ఉపాధి పనులకు వెళ్లిన మహిళ మృతి
తిరువళ్లూరు: ఉపాధి హామీ పనులకు వ్యాన్‌లో వెళ్లిన మహిళ వ్యాన్ నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్‌కుప్పం గ్రామానికి చెందిన మునియమ్మాల్(66) ఉపాధీ హమీ పనులకు ఇంటి నుంచి పని జరిగే ప్రాంతానికి సహచర మహిళలతో కలిసి సరుకులు తీసుకెళ్లే మినీవ్యాన్‌లో బయలుదేరింది. వ్యాన్ డోర్‌పై కూర్చుని వెళ్తున్న సమయంలో కన్నిగైపేర్ వద్ద స్పీడ్‌బ్రేక్‌ను దాటే క్రమంలో వ్యాన్‌లో ఉన్న మహిళ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడింది. రక్తపు గాయాలతో కిందపడ్డ మహిళను స్థానికులు 108 ద్వారా తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మహిళను పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. ఈ సంఘటన స్తానికంగా విషాదాన్ని నింపిన క్రమంలో మృతురాలి బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
ఎల్‌ఐసీ ఏజెంట్ మృతి
తిరువొత్తియూరు: తిరువారూర్‌లో లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఊహించని విధంగా కిందపడడంతో, లారీ టైరు కింద తల చిక్కుకుని వృద్ధుడు మృతి చెందాడు. నాగపట్నం జిల్లా కొళప్పాడు ప్రాంతానికి చెందిన షణ్ముగనాథన్(73) ఎల్‌ఐసీ ఏజెంట్. అతని కుమారుడు తిరువారూర్ విళమల్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడు. కొడుకు వద్దకు వెళ్లిన షణ్ముఖనాథన్ గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా తిరువారూర్ రైల్వే వంతెన మీదుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఊహించని బైక్ అదుపు తప్పి కిందపడి అతని తలపై లారీ టైరు ఎక్కింది. దీంతో షణ్ముగనాథన్ తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నగర పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా తిరువారూర్–నాగపట్నం రోడ్డులో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
క్లుప్తంగా


