తిరువళ్లూరు జిల్లాకు తుపాను ముప్పు | - | Sakshi
Sakshi News home page

తిరువళ్లూరు జిల్లాకు తుపాను ముప్పు

Nov 29 2025 7:21 AM | Updated on Nov 29 2025 7:21 AM

తిరువళ్లూరు జిల్లాకు తుపాను ముప్పు

తిరువళ్లూరు జిల్లాకు తుపాను ముప్పు

● ప్రధాన రిజర్వాయర్ల నీటి మట్టాన్ని తగ్గించాలని నిర్ణయం ● 323 మంది గర్భిణులను వైద్యశాలకు తరలించాలని ఆదేశం

తిరువళ్లూరు: జిల్లాకు తుపాను ముంపుతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలో రెండు అడుగుల మేరకు నీటి మట్టాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు తిరువళ్లూరు జిల్లా మానిటరింగ్‌ అధికారి కార్తికేయన్‌ వివరించారు. తిరువళ్లూరు జిల్లాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో జిల్లాకు మానిటరింగ్‌ అధికారిగా కార్తికేయన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మానిటరింగ్‌ అధికారి కార్తికేయన్‌ శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ప్రతాప్‌తో కలిసి వేర్వేరు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పూండి రిజర్వాయర్‌కు చేరుకుని అక్కడ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను అధికారులను నుంచి సేకరించారు. భారీ వర్షపాతం నమోదయితే ఆంధ్ర, వేలూరు, రాణిపేట జిల్లాల నుంచి ఎంత మొత్తంలో వరద ప్రవాహం ఉంటుందన్న అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెండు షట్టర్‌ల నుంచి సెకనుకు 1300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లా మానిటరింగ్‌ అధికారి మీడియాతో మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చైన్నెకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌లైన పూండి సత్యమూర్తి సాగర్‌ రిజర్వాయర్‌, రెడ్‌హిల్స్‌, కన్నన్‌కోట–తేరువాయి కండ్రిగ రిజర్వాయర్‌, చోళవరం, చెమంబాక్కం రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరినట్టు వివరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధాన రిజర్వాయర్‌లు, లోతట్టు ప్రాంతాలను నేరుగా వెళ్లి పరిశీలిస్తూ, అక్కడి అధికారులకు తగు సూచనలు ఇస్తున్నట్టు తెలిపారు. పూండి రిజర్వాయర్‌ నీటి మట్టం 35 అడుగులు కాగా ప్రస్తుతం 34 అడుగులకు చేరింది. ఈ క్రమంలోనే తిరువళ్లూరుకు తుపాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర, పొరుగు జిల్లాలైన వేలూరు, రాణిపేట నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశఽం భుండడంతో రిజర్వాయర్‌లను భద్రతను దృష్టిలో ఉంచుకుని నీటిని దిగువకు విడుదల చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, రాణిపేట తదితర జిల్లాల నుంచి వరద నీటిని నిత్యం పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఉంచామని, ప్రజలను అప్రమత్తం చేయడానికి కంట్రోల్‌ రూమ్‌ను సైతం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇదే విధంగా తుపాను బాధితులను ఆదుకోవడానికి ఆవడిలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రెండు బృందాలు, 9 అగ్నిమాపక సిబ్బంది బృందాలతోపాటు పళవేర్కాడులోనే బృందాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భారీగా ఈదురు గాలులు వీస్తే పళవేర్కాడులో విద్యుత్‌స్తంభాలు కూలిపోయే ప్రఽమాదం ఉందని వెల్లడించారు. అక్కడ స్తంభాలను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. పూండి రిజర్వాయర్‌ నుంచి నీటిని పెంచి విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. ఇదే విధంగా మరో 15 రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న 323 మంది గర్భిణులను గుర్తించి, వారిని సమీపంలోని వైద్యశాలలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా మానిటరింగ్‌ అధికారి వెంట కలెక్టర్‌ ప్రతాప్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ జయకుమార్‌, ఆర్డీఓ రవిచంద్రన్‌, తహశీల్దార్‌ బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement