హైస్పీడ్ రైలు ట్రయల్‌రన్
సాక్షి, చైన్నె: జోలార్ పేట–కోయంబత్తూరు మధ్య హై స్పీడ్ రైలు ట్రయల్ రన్‌ను దక్షిణ రైల్వే నిర్వహించింది. దక్షిణ రైల్వే పరిధిలోని జోలార్‌పేట్–కోయంబత్తూరు మధ్య 286 కి.మీ దూరాన్ని హైస్పీడ్ ట్రయల్ రన్ ద్వారా విజయవంతం చేశారు. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వేగంతో రైలు నడుపుతున్నారు. దీనిని 130 కి.మీకి పెంచే ప్రయత్నంలో భాగంగా జోలార్ పేట–కోయంబత్తూరు సెక్షన్‌లోని రెండు దిశలలో తప్పనిసరి ట్రయల్ రన్ అవసరమైంది. ఈ మేరకు గురువారం ఉదయం డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి ప్రత్యేక రైలు ట్రయల్ రన్ జరిగింది. మధ్యాహ్నం కోయంబత్తూరుకు రైలు చేరుకుంది. గరిష్టంగా గంటకు 145 కి.మీ వేగంతో రైలు దూసుకెళ్లింది. ఇది వరకు చైన్నె సెంట్రల్–గూడురు మధ్య 134 కి.మీ, సెంట్రల్–అరక్కోణం–రేణిగుంట మధ్య 134.78 కి.మీ, అరక్కోణం–జోలార్‌పేట మధ్య 144.54 కి.మీ వేగంతో రైళ్లు దూసుకెళ్లి ఉండడం గమనార్హం. రానున్న 2026–27 సంవత్సరంలో చైన్నె ఎగ్మూర్–విల్లుపురం, విల్లుపురం–విరుదాచలం, విరుదాచాలం–తిరుచ్చి, కొల్లం–తిరువనంతపురం, తదితర ప్రధాన సెక్షన్లలో 110 నుంచి 130 కి.మీ వేగంతో రైలు నడిపేందుకు చర్యలు చేపట్టనున్నట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది.


