వేలూరు నుంచి అన్నామలైయార్‌లకు గొడుగుల ఊరేగింపు
వేలూరు: వేలూరు కోట మైదానంలో వెలసిన శ్రీ జలకంఠేశ్వరాలయం నుంచి వేలూరు జిల్లా హిందూ ఆలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నామలైయార్‌కు గొడుగులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. వివరాలు.. తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపద్యంలో హిందూ ఆలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏటా గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆరో వార్షిక సంవత్సరంగా సమితి ప్రధాన కార్యదర్శి ఎల్ బాలాజీ, రాష్ట్ర మహిళా బృందం అధ్యక్షరాలు కలైవాణి ఆధ్వర్యంలో వేలూరు కోటలోని ఆలయం నుంచి శివాచార్యుల వేద మంత్రాల నడుమ అశ్వ వాహనంలో గొడుగులను పట్టణంలో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అనంతరం ఈ గొడుగులను తిరువణ్ణామలైలోని అన్నామలైయార్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్య నిర్వహణ అధ్యక్షులు ఎస్‌ఆర్ జయకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్రన్, హిందూ ఆలయ సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.


