సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాలు ఓ వైపు, అల్పపీడన ద్రోణి రూపంలో మరో వైపు కురుస్తున్న వర్షాలపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీతో గురువారం సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో వర్షాలను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలపై చర్చించారు. నైరుతీ బంగాళాఖాతంలో శ్రీలంకకు దక్షిణ తీర ప్రాంతంలో నెలకొన్న అల్పపీడనం రూపంలో రానున్న రోజులలో చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, నాగపట్నం, మైలాడుతురై, రామనాథపురం, రాణిపేట, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. ఇప్పటికే దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా 29వ తేదీ నుంచి భారీ వర్ష హెచ్చరికలతో జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాల గురించి తొలుత సమీక్షించి, అక్కడ చేపట్టిన సహాయక పనులను ఆరా తీశారు. తాజాగా కురిసే వర్షాలను ఎదుర్కొనేందుకు విధ విభాగాల సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగాలు అవసరమైన సన్నాహక చర్యలను మరింత ముమ్మరం చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. తమిళనాడులోని కొత్త సాంకేతికత ఆధారంగా ఎప్పటికప్పుడు సమాచారాలు జిల్లాలకు చేరవేయడం, ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు విస్తృతం చేయాలని సూచించారు. ఈ నెల 29, 30 తేదీలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో మరింత అప్రమత్తత అవశ్యమని హెచ్చరించారు. రెవెన్యూ శాఖ, స్థానిక ప్రభుత్వ శాఖ, పోలీసు శాఖ, అగ్నిమాపక, రెస్క్యూ డిపార్ట్‌మెంట్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్, ఆరోగ్య శాఖతో సహా అన్ని విభాగాలు కలిసి పనిచేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని వివరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్.రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి మురుగానందం, రెవెన్యూ కార్యదర్శి డాక్టర్ ఎం.సాయి కుమార్, ఇంధన శాఖ అదనపు కార్యదర్శి మంగత్ రా మ్ శర్మ, పంచాయతీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ, హోం వ్యవహారాల అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్ పాల్గొన్నారు.


