తుపాకీతో కాల్చుకుని పోలీసు ఆత్మహత్య
సాక్షి, చైన్నె : విధుల్లో ఉన్న స్పెషల్ ఫోర్సు పోలీసు తుపాకీతో కాల్చుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధురై ధర్మాసనం ఆవరణలో కలకలం రేపింది. వివరాలు.. మధురై కొట్టాయి పట్టి గ్రామానికి చెందిన మాణిక్యం, పొట్టు అమ్మల్ దంపతుల కుమారుడు మహాలింగం(29) తమిళనాడు పోలీసు విభాగంలోని ప్రత్యేక ఫోర్సులో 2023లో చేరాడు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో భద్రతా విధులలో నిమగ్నమై ఉన్నాడు. గత కొన్ని రోజులుగా సెలవు అన్నది లేకుండా విధులకు వచ్చి వెళ్తున్నట్టు సమాచారం. గురువారం వేకువ జామున మూడు గంటల సమయంలో విధులలో ఉండగా హఠాత్తుగ తుపాకీ కాల్పు శబ్ధం రావడంతో అక్కడ విధులలో ఉన్న ఇతర సిబ్బంది పరుగులు తీశారు. తనను తాను కాల్చుకున్న స్థితిలో మహాలింగం రక్తపు మడుగులో పడి ఉండటంతో అతడ్ని ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. మధురై ఆస్పత్రి వైద్యులు పరీక్షించగా, మహాలింగం మరణించినట్టు తేలింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అతడి బ్యాగ్‌లో లభించిన లేఖతో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. ఆ లేఖలో తన మరణానికి ఎవ్వరూ కారకులు కాదు అని పేర్కొని ఉన్నప్పటికీ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అని విచారణ చేస్తున్నారు.


