సంపూర్ణ మద్దతు ఇవ్వండి
న్యూస్‌రీల్
బూత్ కమిటీలకు సీఎం స్టాలిన్ పిలుపు ఎస్‌ఐఆర్ కుట్రలను భగ్నం చేద్దామని సూచన కొళత్తూరులో విస్తృతంగా పర్యటన
ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్రంలోని బీజేపీ పాలకులు రచిస్తున్న కుట్రలు, వ్యూహాలన్నింటినీ బద్దలు కొట్టేందుకు తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బూత్‌కమిటీలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ రూపంలో సాగుతున్న కుట్రలను భగ్నం చేద్దామన్నారు.
– సాక్షి, చైన్నె
డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ‘నా పోలింగ్ కేంద్రం, విజయపు కేంద్రం’ అన్న అంశంపై కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బూత్ ఏజెంట్లు, కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బూత్ కమిటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు ఎక్కడికి వెళ్లినా ఎస్‌ఐఆర్ గురించే జనం మాట్లాడుకుంటున్నారని వివరించారు. ప్రతి వ్యక్తి తాను భారతీయుడిని అని చెప్పుకునే పరిస్థితి తాజాగా నెలకొందన్నారు. ప్రతి పౌరుడు తానెవరో నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఇందుకు కారణం కేంద్ర ఎన్నికల కమిషన్ తీరేనని మండి పడ్డారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు సిద్ధమయ్యారని మండి పడ్డారు. ఇన్నాళ్లు దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలపై దాడులు చేయిస్తూ వచ్చారని, ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని ప్రజల ఓట్లను దోచుకుని, ఆయా రాష్ట్రాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకునే కుట్రలు వేగవంతం చేశారని ధ్వజమెత్తారు. ఓటు చౌర్యంపై లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారని వివరించారు. ఆధారాలతో ఆయన కేంద్రం కుట్రలను బట్టబయలు చేశారని పేర్కొన్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే, దొడ్డి దారిలో ప్రవేశించేందుకు ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు విస్తృతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రంథాలయం
ముందుగా సీఎం స్టాలిన్ తన నియోజకవర్గం పరిధిలో రూ.5.24 కోట్ల వ్యయంతో పునరుద్ధరించబడిన పెరియార్ నగర్ లైబ్రరీ, కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడి పుస్తకాలను పరిశీలించారు. రూ.3.86 కోట్లతో నిర్మించిన పెరియమేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. రూ.68 లక్షలతో పెరియార్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అవుట్ పోస్టు పోలీసు స్టేషన్ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.మూర్తి, శేఖర్‌బాబు, మేయర్ ఆర్.ప్రియ, ఎంపీ కళానిధి వీరాస్వామి, గిరిరాజన్, శాసనసభ సభ్యులు పరంధామన్, వెట్రి అళగన్, తాయగం కవి, జోసెఫ్ శామ్యూల్, తమిళనాడు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రంగనాథన్, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్య కార్యదర్శి కె.ప్రకాష్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె.కుమారగురుబరన్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శిల్పా ప్రభాకర్ సతీష్, అర్బన్ ప్లానింగ్ డైరెక్టరేట్ డైరెక్టర్ పి.గణేశన్, చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.శివజ్ఞానం, రిజిస్ట్రేషన్ విభాగం అధిపతి దినేష్ పొన్‌రాజ్ ఆలివర్, డిప్యూటీ కమిషనర్, సెంట్రల్ సర్కిల్, కార్పొరేషన్ హెచ్.ఆర్.కౌశిక్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్– కొళత్తూర్ పి.కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా భారత తొలి ప్రధాని చాచా నెహ్రు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేస్తూ, బాలల దినోత్సవ శుభాకాంక్షలను సీఎం తెలియజేశారు. అలాగే క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడంపై క్రైస్తవ బిషప్‌లతో స్టాలిన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తున్న స్టాలిన్
గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
ఓటరు జాబితా నుంచి ఏ ఒక్క అర్హుడి పేరు తొలగించకుండా అప్రమత్తంగా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు, ఏజెంట్లు వ్యవహరించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా తాము ఇంటా బయట అన్నట్టుగా వీధులలో, కోర్టులలో పోరాటంఽ ఉధృతం చేశామన్నారు. డీఎంకే కూటమి పార్టీలే కాదు, మరెన్నో పార్టీలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నాయని గుర్తు చేశారు. అయితే అన్నాడీఎంకే దీన్ని ఆహ్వానిస్తుండడం అనుమానాలకు బలాన్ని చేకూర్చుతోందన్నారు. అనేక వ్యూహాలు, కుట్రలు జోరందుకున్న ఈ సమయంలో ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదేనని, ఈ సారి ప్రజల ఓటు హక్కును కాపాడాల్సింది కూడా మీరేనని పిలుపునిచ్చారు. ఇంటింటా వెళ్లాలని ఎస్‌ఐఆర్ వ్యవహారంలో ఓటర్లకు సహకారం అందించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ నమోదు చేసుకునేందుకు రూపకల్పన చేసిన దరఖాస్తు ఫాంలో అనేక గందరగోళాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ప్రక్రియ మొదలై పది రోజులు పూర్తి అయిందని, ఇంత వరకు దరఖాస్తు అధిక శాతం మందికి చేరలేదన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారని గుర్తు చేశారు. కేరళలోని వామపక్షాలు సైతం ముందుడుగు వేయాలని పిలుపునిచ్చారు. సర్వత్రా ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తుంటే, అన్నాడీఎంకే వెనకేసుకు రావడం శోచనీయమన్నారు. ఇప్పటికే ఆ పార్టీని ఢిల్లీకి తాకట్టు పెట్టేశారని, తాజాగా తమిళనాడును సైతం తాకట్టు పెట్టేందుకు ప్రతిపక్ష నేత పళని స్వామి ఉవ్విళ్లూరుతున్నట్టుందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో అందరిని తాను ఒక్కటే కోరుతున్నానని, నియోజకవర్గాల్లోని ప్రతి వార్డులో తిరగాలని, ఎస్‌ఐఆర్ వ్యవహారంలో ప్రజలకు సాయం అందించాలని ఆదేశించారు. కొళత్తూరులో విజయం ముందుగా నిర్ణయించబడిందేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కొళత్తూరుకు వచ్చినప్పుడల్లా తెలియని ఆనందం కలుగుతుందని పేర్కొంటూ, మరో 15 రోజులు శ్రమించాలన్నారు. ఎస్‌ఐఆర్ రూపంలో ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. కొళత్తూరు నియోజకవర్గం ఎలా ఉందో కొంత సమాచారం ఇవ్వాలని సూచిస్తూ, ఓటర్లకు ఉన్న హక్కులను పరిరక్షించేందుకు మరింతగా శ్రమించాలని కోరారు.
సంపూర్ణ మద్దతు ఇవ్వండి
సంపూర్ణ మద్దతు ఇవ్వండి
సంపూర్ణ మద్దతు ఇవ్వండి


