కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని మహాబలిపురం వద్ద పీసీ–7 ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ట్రైనీ అధికారి పారాచూట్ సాయంతో తప్పించుకుని ఆస్పత్రి పాలయ్యాడు. సేలం నుంచి ప్రైవేటు శిక్షణా సంస్థకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ గురువారం తిరుచ్చి–పుదుకోట్టై రహదారిలో ల్యాండ్ కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం కారణంగా శిక్షణలో ఉన్న పైలట్ రహదారిలో దీనిని ల్యాడింగ్ చేసి స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు.
ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను అర్ధరాత్రి సమయంలో భారీ క్రేన్ల సాయంతో కంటైనర్‌లో సేలంకు తరలించారు. ఈ ఘటన మరువకముందే శుక్రవారం మధ్యాహ్నం చైన్నె శివారులో మరో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఇది పేలి పోవడంతో ఆ పరిసరాలలో కలకలం బయలు దేరింది.
శిక్షణలో ఉన్న పీసీ–7 ఎయిర్ క్రాఫ్ట్
చైన్నె శివారులోని తాంబరంలో భారత ఎయిర్‌ఫోర్సు స్టేషన్ ఉంది. ఇక్కడ ఎయిర్ ఫోర్సు శిక్షణ అందిస్తున్నారు. నిత్యం ఆ పరిసరాలలో హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఓ ట్రైనీ మధ్యాహ్న సమయంలో శిక్షణలో భాగంగా పీసీ– 7 రకానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌తో టేకాఫ్ తీసుకున్నారు. సుమారు 1100 మీటర్ల ఎత్తులో శిక్షణలో ఉండగా హఠాత్తుగా ఎయిర్‌క్రాఫ్ట్ సాంకేతిక సమస్య కారణంగా భూమి వైపుగా దూసుకు వచ్చింది. మహాబలిపురం సమీపంలోని నెమలి ప్రాంతంలో బురదలో కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్ క్షణాలలో పేలిపోయింది. ఆ పరిసరాలన్నీ దట్టమైన పొగతో నిండింది. విమానం కుప్పకూలిందన్న సమాచారంతో ఆ పరిసరాలలో కలకలం బయల్దేరింది.
అదే సమయంలో సంఘటన జరిగిన ప్రాంతానికి కూత వేటు దూరంలో పారాచూట్ సాయంతో కిందకు ఒకరు వచ్చి పడి పోవడంతో అతడ్ని రక్షించే ప్రయత్నం చేశారు. తాంబరం ఎయిర్‌ఫోర్సు స్టేషన్ నుంచి తక్షణం హెలికాప్టర్లు అక్కడకు చేరుకుని అతడ్ని చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించాయి. ఆర్మీ అధికారులు, ఎయిర్‌ఫోర్సు అధికారులు, మహాబలిపురం పోలీసులు రంగంలోకి దిగి ఆ పరిసరాలలో విమాన శకలాల సేకరణపై దృష్టి పెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలడంపై విచారిస్తున్నారు.
సంఘటనా స్థలం, ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న ఎయిర్ ఫోర్స్ వర్గాలు
తప్పిన పెను ప్రమాదం
ఎయిర్ క్రాఫ్ట్ వంద మీటర్లు కాస్త ముందుకు వెళ్లి కుప్పకూలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. సంఘటన జరిగిన ప్రదేశానికి వంద మీటర్ల దూరంలో ఉప్పు తయారీ పరిశ్రమ ఉంది. ఇక్కడ పదుల సంఖ్యలో కార్మికులు విధులలో ఉన్నారు. సంఘటన జరిగిన సమయంలో ఇక్కడి కార్మికులు భయాందోళనకు గురి అయ్యారు. ఆ పరిశ్రమలోని అద్దాలు అన్నీ విమానం పేలిన సమయంలో పగిలి పోయాయి. సరిగ్గా బురదలో కూరుకుపోయి పేలడం వలనే విస్ఫోటనం అక్కడికే పరిమితం కావడం గమనార్హం. లేని పక్షంలో ఆ పరిశ్రమ అంతా అగ్నికి ఆహుతై ఉండేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కుప్పకూలిన ఎయిర్‌క్రాఫ్ట్


