టీవీకే డిజిటల్ ఐడీ కార్డులు
– విజయ్ ఏర్పాట్లు
సాక్షి, చైన్నె: పార్టీలో 1.20 లక్షల మందికి డిజిటల్ ఐడీ కార్డులను అందజేయడానికి తమిళగ వెట్రికళగం(టీవీకే) నేత విజయ్ నిర్ణయించారు. కరూర్ విషాద ఘటన అనంతరం పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతం, తన పర్యటనలకు సంబంధించిన రూట్ మ్యాప్ కసరత్తులలో విజయ్ ఉన్న విషయం తెలిసిందే. పార్టీ పరంగా ఇక జిల్లా, యూనియన్, నగర తదితర ప్రాంతాలలో కార్యక్రమాలు, ప్రచార పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లు విషయంగా ముఖ్య నిర్వాహకులతో సంప్రదింపునకు విజయ్ నిర్ణయించారు. జిల్లా, నగర, యూనియన్ శాఖలలో ఒక లక్షా 20 వేల మంది ఇప్పటికే పదువులు కేటాయించారు. మరో రెండు లక్షల మందికి త్వరలో పదవులు అప్పగించనున్నారు. ఈ పరిస్థితులలో తన పర్యటనలకు సంబంధించి వలంటీర్లు, భద్రతా పరంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇది వరకు పార్టీలో వివిధ కేటగిరీలలో పదవులలో నియమితులైన వారికి విజయ్ గుర్తింపు కార్డుల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. వీరే తమ పార్టీ వారు అని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా డిజిటల్ తరహాలో ఐడీ కార్డులను సిద్ధం చేయించారు. తన పర్యటనల భద్రత కోసం విజయ్ రిటైర్డ్ పోలీసు అధికారులతో సైతం బృందాన్ని నియమించుకున్నారు. వీరందరికి పార్టీ పరంగా గుర్తింపుకార్డులు సిద్ధం చేశారు. ఒక లక్షా 20 వేల మందికి ఈ కార్డుల పంపిణీకి శుక్రవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ శ్రీకారం చుట్టారు. ఈ డిజిటల్ కార్డులో సంబంధిత నాయకుడికి సంబంధించిన అన్ని వివరాలను పొందు పరిచారు. ఏదేని అనుమానం వచ్చి ఎవరి వద్దనైనా ఉన్న కార్డును తనిఖీ చేసిన పక్షంలో అందులో ఉన్న వివరాలు తమ వద్ద ఉన్న వివరాలకు సరిపోక పోతే వారు తమ పార్టీ వారు కాదని తెలియజేయనున్నారు. తమకు వ్యతిరేకంగా ఏదేని కుట్రలు విస్తృతమైన పక్షంలో వాటిని భగ్నం చేయడానికి ఈ డిజిటల్ కార్డులు ఉపయోగకరంగా ఉంటాయని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ నెల 16న ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసనను జయప్రదం చేయాలని పార్టీ వర్గాలకు విజయ్ పిలుపునిచ్చారు.


