నేడు అల్పపీడన ద్రోణి
– 17, 18వ తేదీలలో చైన్నెలో వానలు
సాక్షి, చైన్నె: దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో శనివారం అల్పపీడన ద్రోణి బయలు దేరనున్నది. ఈ ప్రభావంతో 17, 18వ తేదీలలో చైన్నె, శివారు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్టోబరులో ముందుగానే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ పవనాలతో ఆశాజనకంగానే వర్షాలు పడ్డాయి. అయితే, మోంథా తుపాను తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్‌లో కురవాల్సిన వర్షం ఇంత వరకు పడ లేదు. ఈ పరిస్థితులలో శనివారం శ్రీలంకకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం బయలు దేరనుండడంతో వర్షాలు మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇది క్రమంగా విస్తరించనున్నది. అల్పపీడనం తదుపరి 17, 18వ తేదీలలో చైన్నె, శివారు జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించే పనిలో నిమగ్నమైంది.
ఢిల్లీకి గవర్నర్ ఆర్‌ఎన్ రవి
కొరుక్కుపేట: రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి శుక్రవారం ఉదయం 8.05 గంటలకు చైన్నె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా ప్యాసింజర్ విమానంలో ఒకరోజు అత్యవసర పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి బయల్దేరారు. ఆయనతోపాటు ఆయన కార్యదర్శి, భద్రతాధికారి, సహాయకుడు కూడా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి రాత్రి 9 గంటలకు న్యూఢిల్లీ నుండి ఎయిరిండియా ప్యాసింజర్ విమానంలో చైన్నెకి తిరిగి వస్తారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి గత వారం న్యూఢిల్లీ వెళ్లి ఆదివారం రాత్రి చైన్నెకి తిరిగి వచ్చారు. ఈ పరిస్థితిలో ఆయన గురువారం మళ్లీ అత్యవసరంగా ఒకరోజు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి బయల్దేరారు. తమిళనాడు గవర్నర్ అత్యవసరంగా ఒకరోజు ఢిల్లీ పర్యటనపై అధికారిక సమాచారం విడుదల కాలేదు.
జనవరిలో ప్రజా చైతన్యయాత్ర
– పళణి రూట్ మ్యాప్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నిర్వహించనున్న ప్రజా చైతన్య యాత్ర జనవరిలో చైన్నెలో విస్తృతంగా జరిగే విధంగా రూట్ మ్యాప్ రూపకల్పన జరుగుతోంది. తమిళనాడు, తమిళ పజలను రక్షిద్దామన్న నినాదంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కోయంబత్తూరు నుంచి ప్రజా చైతన్య యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 174 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించారు. మరో 60 నియోజకవర్గాలలో పర్యటించాల్సిన సమయంలో కరూర్‌లో విజయ్ ప్రచార సభలో చోటు చేసుకున్న విషాదంతో యాత్రలకు బ్రేక్ పడింది. అన్ని రకాల యాత్రలకు హైకోర్టు బ్రేక్ వేసిన దృష్ట్యా, తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించనున్నది. ఇది మరికొద్ది రోజులలో అమల్లోకి రానున్నది. దీంతో డిసెంబరు మొదటి వారం నుంచి నేతలందరూ రాష్ట్ర పర్యటనల మీద దృష్టి పెట్టనున్నారు. ఇందులో భాగంగా పళణిస్వామి తన ప్రజా చైతన్యయాత్రను ముందుకు తీసుకెళ్లేందుకు రూట్ మ్యాప్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. డిసెంబరు నెలలో సాధారణంగా చైన్నె, శివారు జిల్లాలో అధిక వర్షం పడడం ఖాయం. ఈ దృష్ట్యా ఇక్కడ ప్రచార పర్యటనను జనవరిలో విస్తృతం చేసుకునే దిశగా కసరత్తులలో ఉన్నారు. ముందుగా ఇతర ప్రాంతాలలో పర్యటించి, చివరగా చైన్నైపె దృష్టి పెట్టే విధంగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.
ఇరాక్ వాసికి చైన్నెలో చికిత్స
సాక్షి, చైన్నె: ఇరాక్‌కు చెందిన వ్యక్తికి చైన్నె ఎస్‌ఆర్‌ఎం గ్లోబల్ ఆస్పత్రిలో అధునాతన లేజర్ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. ఇరాక్‌కు చెందిన 74 సంత్సరాల వ్యక్తి మూత్ర విసర్జన సమస్యతో బాధ పడుతూ వచ్చారు. హై రిస్క్ కార్డియాక్ కండిషన్‌తో సైతం బాధపడుతున్న ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకొచ్చారు. ఎస్‌ఆర్‌ఎం గ్లోబల్ వైద్యులు పరీక్షించి బెనిన్ ప్రోస్థటిక్ ఎన్‌లార్జ్‌మెంట్‌తో కలిగే అబ్స్రక్టివ్ యూరినరీ లక్షణాలతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. ఇది సాధారణంగా పురుషులను ప్రభావితం చేసే ప్రోస్టెట్ గ్రంథి పరిమాణంలో క్యాన్సర్ కాని పెరుగుదలగా గుర్తించారు. రోగి తీవ్రమైన కొరోనరీ ఆర్టరీ వ్యాధి, ఇతర మందుల ఉపయోగం పరిగణించి సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్టు డాక్టర్ ఆనంద్ కృష్ణమూర్తి, డాక్టర్ దీపక్ నాయకత్వంలో అనస్థీషియస్ట్ డాక్టర్ వరుణ, కార్డియాలజిస్టు డాక్టర్ టీఆర్ మురళీ ధరన్ రోగికి ఆధునిక విధానం అనుసరించి శస్త్ర చికిత్సకు చర్యలు తీసుకున్నారు. మినిమల్లీ ఇన్వాసివ్ లేజర్ ప్రక్రియతో కనిష్ట రక్త స్రావంతో సర్జరీ పూర్తి చేయడంతో ఆయన త్వరితగతిన కోలుకున్నట్టు వైద్యులు శుక్రవారం ప్రకటించారు.


