24 నుంచి లైసెన్స్ లేకుంటే జరిమానా
సాక్షి,చైన్నె: పెంపుడు జంతువులకు లైసెన్సులను తప్పనిసరి చేశారు. లైసెన్సులు లేకుంటే రూ. 5 వేలు జరిమానా ఈనెల 24 నుంచి విధించనున్నట్లు కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సుల మంజూరు కోసం ప్రతి ఆదివారం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆరు చోట్లశిబిరాలు జరిగాయి. వివరాలు.. చైన్నెలో అనేక మంది శునకాలు, పిల్లులు తదితర వాటిని పెంచుకోవడం తెలిసిందే. వీటిని బయటకు తీసుకొచ్చే క్రమంలో సమస్యలు తప్పడం లేదు. కొన్ని చోట్ల శునకాలు దాడి చేసి గాయ పరిచిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెంపుడు జంతువులకు లైసెన్సులు తప్పనిసరి చేస్తూ చైన్నె కార్పొరేషన్ సమావేశంలో తీర్మానం చేశారు. పెంపుడు జంతువులు, వీధులలో తిరిగే శునకాలు, అవి సృష్టించే వీరంగాల గురించి కార్పొరేషన్ తీవ్రంగా పరిగణించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధులలో తిరిగి శునకాలను కట్టడిచేసేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టారు. అదే విధంగా పెంపుడు జంతువులకు లైసెన్సులు లేకుంటే రూ. 5 వేలు జరిమానా విధించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 24వ తేది నుంచి ఈ జరిమానా అమలు చేయనున్నారు. పెంపుడు జంతువులకు బయటకు తీసుకొచ్చే క్రమంలో వాటి మెడకు రక్షణ బ్యాడ్జీలు లేకుంటే రూ. 500 జరిమాన విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇక, పెంపుడు జంతువులను బహిరంగ ప్రదేశాలకు తీసుకొచ్చి మల, మూత్ర విసర్జన చేయించినా చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈనెల 24వ తేదీ నుంచి చైన్నె కార్పొరేషన్ పరిధిలో జరిమానాలు విధించనుండడంతో పెంపుడు జంతువులను కలిగిన వారు లైసెన్సుల మీద దృష్టి పెట్టారు. వీరి కోసం ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఆరు మండలాలలో శిబిరాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన జంతుప్రేమికులు తాము పెంచుకుంటున్న శునకాలు, పిల్లులు తదిర వాటికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.


