విజయ్ పెద్ద తప్పు చేశాడు!
సాక్షి, చైన్నె : కరూర్ బాధితులను చైన్నెకు పిలిపించి మరీ పరామర్శించి టీవీకే నేత, నటుడు విజయ్ పెద్ద తప్పు చేశారని ఎండీఎంకే నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎగ్మూర్‌లోని తాయగంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంపీ దురై వైగో, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఏకే మణి తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ప్రజల ఓట్లను దోచుకునే పనిలో పడిన కేంద్రంలోని బీజేపీ సర్కారును, వారి చేతిలో కీలు బొమ్మగా ఉన్న ఎన్నికల కమిషన్ పనితీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, రాజకీయ పక్షాల సభలు, సమావేశాలు, రోడ్ షోలకు డిపాజిట్ల వసూలు అన్నది ఆచరణాత్మకంగా సమస్యలు వస్తాయని పేర్కొంటూ, ఇందులో మార్పు చేయాలని డీఎంకే ప్రభుత్వానికి సూచిస్తూ మరో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ 2011 ఎన్నికల సమయంలో పన్నీరు సెల్వం పెద్ద తప్పిదం చేశారని, కూటమి విషయంగా జయలలిత ఇచ్చిన సంకేతాన్ని మార్చి చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే తాము ఎన్నికలను అప్పుడు బహిష్కరించాల్సి వచ్చిందన్నారు. పెద్ద తప్పిదం చేసిన పన్నీరు సెల్వం ఇప్పుడు ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇక, తాజాగా విజయ్ ఒక పెద్ద తప్పిదం చేశాడని పేర్కొంటూ, కరూర్ బాధితులను చైన్నెకు పిలిపించి పరామర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇది చాలా పెద్ద తప్పిదం అని, ఇందుకు విజయ్ మూల్యం చెల్లించుకోవడం తథ్యమని హెచ్చరించారు.


