అవయవ దాతలకు గౌరవం
సాక్షి, చైన్నె : అవయవ దానంతో మరొకరికి పునర్జన్మను ఇచ్చిన వారికి అరుదైన గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ జీహెచ్‌లో ఓ వైపు గోడలో పూర్తిగా త్యాగ బోర్టు ఏర్పాటు చేశారు. ఇందులో అవయవ దానం చేసిన వారి పేర్లను పొందుపరిచారు. బ్రెయిన్‌డెడ్ గురైనవారు అవయవాలను దానం చేయాలన్న సామాజిక చైతన్యం ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెరిగిన విషయం తెలిసిందే. అవయవ దానంలో తమిళనాడు ముందంజలో ఉంది. దేశ విదేశాల నుంచి సైతం రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి అవయవ మార్పిడి చికిత్సలు పొందుతున్నారు. అదే సమయంలో అవయవ దానంలో అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రభుత్వం పకడ్బందీగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో నమోదు చేసుకున్న వారికి ఒకరి తర్వాత మరొకరికి అవయవ మార్పిడి జరుగుతోంది. అలాగే అవయవ దానం చేసి మరెందరికో పునర్జన్మను ఇచ్చే దాతల భౌతిక కాయాలకు ఆస్పత్రి ఘన నివాళుర్పించేలా చర్యలు తీసుకుంది.
గొప్ప త్యాగాలు
తమిళనాడు అవయవదానంలో నంబర్‌వన్‌గా అవతరించి ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా అవయవ దాతల పేర్లు రాసిన త్యాగాల గోడ చైన్నె రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. శుక్రవారం దీనిని ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్, హిందూధర్మాదాయ శాఖ మంత్రి పి.కె. శేఖర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 2009లోనే సీఎం స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ అవయవ దానం కోసం ప్రతిజ్ఞ రూపంలో తాము సైతం అంటూ సంతకం చేశారని గుర్తు చేశారు. అవయవ దానం చరిత్ర ఉందంటూ కన్నప్ప తన రెండు కళ్లను దాన చేసిన పురాణగాథను గుర్తు చేశారు. 2008లో తిరుక్కళి గుండ్రకు చెందిన హితేంద్రన్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో తొలిసారిగా రాష్ట్రంలో అతడి గుండె బెంగళూరులోని ఓ యువతికి మార్పిడి జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. అవయవాలను దానం చేసిన వారి భౌతిక కాయాలను జిల్లా పరిపాలన విభాగం తరఫున గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఏటా అవయవ దాతల సంఖ్య పెరుగుతోందని పేర్కొంటూ, దాతలకు నివాళులర్పించేలా వారి పేర్లతో ప్రత్యేకంగా గౌరవం కల్పించే రీతిలో అద్భుతమైన త్యాగగోడ ప్రపథమంగా రాజీవ్ గాంధీ జీహెచ్‌లో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు.


