 
															● పోలీసులకు ఈడీ లేఖ ● విచారణకు ప్రతిపక్షాల పట్టు ● అక్ర
ఉద్యోగాల్లో అక్రమాలు
సాక్షి, చైన్నె: రాష్ట్ర నగరాభివృద్ధి, నీటి పారుదల శాఖల్లో గత ఏడాది జరిగిన 2,538 ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు సమా చారాలు వెలుగులోకి వచ్చాయి. తాము జరిపిన ఓ సోదాలో లభించిన ఆధారాల మేరకు ఈ వివరాలను ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తమిళనాడు పోలీసులకు లేఖ రూపంలో తెలియజేయడం చర్చకు దారి తీసింది. 2024లో 2,538 పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున లంచం తాండవం చేసిందని, రూ. 25లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పోస్టులను అమ్ముకున్నట్టు ఈడీ పేర్కొన్నట్టుగా వెలువడిన సమాచారం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ప్రతి పక్షాలు విచారణకు పట్టుబట్టే పనిలో పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న అర్హులైన వారికి ఉద్యోగాలు దరి చేరడం లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అవినీతి, అక్రమాలు జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయని, తాజాగా ఈడీ ఈ అక్రమాన్ని గుర్తించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవశ్యం ఉందన్నారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ లేదా, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పీఎంకే నేత అన్బుమణి స్పందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రూ.888 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు. ప్రతి ఉద్యోగానికి లంచం తాండవం చేసి ఉందని, ఈ మొత్తం హవాల రూపంలో పలు మార్గాల్లో ప్రయాణించిన్నట్టు వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు అప్పగించడం తాజాగా తేటతెల్లమైందని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈడీ నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని ఐఎఎస్ అధికారి కార్తికేయన్ స్పష్టం చేశారు. మంత్రి కేఎన్ నెహ్రు స్పందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్ని పరీక్షలు పగడ్బందీగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
