ఆరెంజ్ అలర్ట్!
ఏడు జిల్లాలపై మోంథా ఎఫెక్ట్ అధికార యంత్రాంగం అప్రమత్తం చైన్నెకి తరలిన ఇతర జిల్లాల అగ్నిమాపక సిబ్బంది నదీ ముఖ ద్వారాల వద్ద పూడికతీత పనుల వేగవంతానికి సీఎం ఆదేశాలు
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల రాకతో రాష్ట్రంలో ఇప్పటికే ఆశాజనకంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాశి, తేని జిల్లాలలో గత పదిరోజులుగా వర్షాలు కొనసాగుతూ వస్తున్నాయి. డెల్టాలోని పలు జిల్లాలను వర్షం ఇప్పటికే ముంచెత్తింది. దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలోని రిజర్వాయర్లు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక, ఉత్తర తమిళనాడులోని చైన్నె, శివారులతో పాటూ పలు జిల్లాలో వర్షం సాధారణం కంటే అధికంగా కురిసింది. ఈ సీజన్‌లో గత పది రోజులలో చైన్నెలో సాధారణం కంటే 57 శాతం అధికంగా వర్షం పడింది. ఈ పరిస్థితులలో బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇది తుపాన్‌గా మారింది. ఇప్పటికే ఈ తుపాన్‌కు మోంథా అని నామకరణం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని దాటుతున్నప్పటికీ, దీని ప్రభావం చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై, వేలూరు, తిరువళ్లూరు జిల్లాలపై అధికంగా పడనుంది.
దెబ్బతిన్న వరిధాన్యం పరిశీలన..
ఇక రెండవ రోజైన ఆదివారం కూడా కేంద్ర బృందం అధికారులు వరి కొనుగోలు కేంద్రాలలో పరిశీలన చేశారు. తడిసిన వరి పంటను పరిశీలించి, శాంపిల్స్ తీసుకెళ్లారు. తంజావూరు, తిరుచ్చి, తిరువారూర్‌లో పలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను అధికారులకు తెలియజేశారు. తేమశాతాన్ని 22కు పెంచాలని విన్నవించారు. ఇదిలా ఉండగా వరి పంట రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా పొలంలోకి దిగిదెబ్బ తిన్న వరి పంటను చేతికి తీసుకుని పరిశీలించినట్టు వివరించారు. సీఎం స్టాలిన్ సైతం పొలాలలోకి వెళ్లి రైతులను పరామర్శించి, దెబ్బ తిన్న వరి పంటను పరిశీలించకుండా సినిమా వాళ్లకు షేక్ హ్యాండ్ , అభినందనలు అంటూ బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కాగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ సకాలంలో వరి కొనుగోళ్లు చేస్తున్నామని వివరిస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు తమిళనాడులో 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని వ్యాఖ్యలు చేశారు.
పనుల్లో వేగం పెంచండి..
అడయార్ నది సముద్రంలో కలిసే ముఖ ద్వారం వద్ద పూడిక తీత పనుల వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. రెండురోజులలో ఈ పనులు ముగించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రి ఎం. సుబ్రమణియన్‌తో పాటూ అధికారులు రెండో రోజైన ఆదివారం ఉదయం ఇక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. నదిముఖ ద్వారంలో పూడిక తీత, విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల అవకాశాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన
మోంథా తుపాన్ ప్రభావంతో చైన్నె,
దాని శివారు జిల్లాలలో కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షం పడే అవకాశాలు ఉన్నట్టు వాతా
వరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో వర్షాలు ఉంటాయన్న ప్రకటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చైన్నెకు ఇతర జిల్లాల నుంచి
అగ్నిమాపక సిబ్బందిని రప్పిస్తోంది.
సర్వ సన్నద్ధం..
చైన్నెలో అతి భారీవర్షం కురిసిన పక్షంలో ఎదుర్కొనేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే విస్తృత చర్యలు చేపట్టారు. తిరునల్వేలి, తూత్తుకుడి, మదురై, తదితర జిల్లాల నుంచి చైన్నెకు సహాయక పనుల నిమిత్తం ముందస్తుగా అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించే పనిలో పడ్డారు. ఆదివారం 120 మందితో కూడిన బృందం చైన్నెకు చేరుకుంది. 17 రబ్బర్ పడవలను సైతం ఈ బృందం సిద్ధం చేసి పెట్టుకోవడం గమనార్హం. మొత్తం 900 మందిని రంగంలోకి దించేందుకు చర్యలు తీసుకున్నారు. శివారులలోని కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇక్కడి వాగులు వంకలు,నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అయితే సోమ, మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేశారు. పాఠశాలలను శిబిరాలుగా మార్చేశారు. యానంలో మరింతగా ముందు జాగ్రత్తలు విస్తృతం చేశారు. ఇక, పశ్చిమ కనుమలలో వర్షాలతో వైగై నది నిర్ణీత 71 అడుగులకు చేరడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. చిన్న, పెద్ద గేట్లను ఎత్తి వేయడంతో తేని, మదురై, దిండుగల్, రామనాథపురం, శివగంగై జిల్లాలలోని వైగై నదీ తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మేట్టూరు జలాశయం నుంచి ఉబరినీటి విడుదల శాతం పెంపుతో కావేరీ తీర గ్రామాల ప్రజలను అలెర్ట్ చేశారు. కాగా, కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ వద్ద ఉరుములతో కూడినవర్షం పడింది. ఈ సమయంలో పిడుగు పడడంతో ఆ గ్రామానికి చెందిన నటరాజన్ కుమారుడు సుబ్రమణ్యం(51) మరణించాడు.


