తమిళ బంగారాలకు సత్కారం
సాక్షి, చైన్నె : ఆసియా యూత్ గేమ్స్‌లో తమిళనాడుకు చెందిన కబడ్డీ క్రీడాకారులు అభినేష్ మోహన్ దాస్, కార్తీక రమేష్‌లు బంగారు పతకాలను సాధించారు. చైన్నెకు చేరుకున్న వీరికి విమానాశ్రయంలో ఆదివారం బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం లభించింది. వీరంతా నేరు గా సీఎం స్టాలిన్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా క్రీడల మంత్రి, డిప్యూటీసీఎం ఉదయ నిధి స్టాలిన్ క్రీడల శాఖ కార్యదర్శిఅతుల్య మిశ్ర, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డిలు సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ఈ బంగార పతకాల విజేతలకు రూ. 25 లక్షలు చొప్పున చెక్కును అందజేశారు.
ఎన్‌ఐఏ అదుపులో
ముగ్గురు నిందితులు
– చైన్నెలో ముమ్మర విచారణ
కొరుక్కుపేట: బీజేపీ నాయకుడి హత్యకేసులో అరెస్టు అయిన ముగ్గురిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. వివరాలు.. పుదుచ్చేరిలోని వి. మంగళం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న సెంథిల్‌కుమారన్‌ను మార్చి 26, 2023న విల్లియనూర్ కనుపైట్టె ప్రాంతంలో కొందరు హత్య చేశారు. ఆయన విల్లియనూర్ నివాసి. తన ఇంటికి సమీపంలోని బేకరీ వద్ద నిలబడి ఉండగా, ఆరుగురు వ్యక్తుల ముఠా అకస్మాత్తుగా సెంథిల్‌కుమారన్‌పై బాంబు విసిరారు. ఆయన అపస్మారక స్థితిలో నేలపై పడిపోయిన తర్వాత కొడవలితో నరికి చంపారు. ఇది తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరువాత కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. ఈ కేసులో నిందితులు పుదుచ్చేరి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు శివమలైతో సహా అదుపులోకి తీసుకున్న ముగ్గురి నేపథ్యంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్‌ఐఏ అధికారులు ప్రణాళిక వేశారు. దీని తర్వాత, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ముగ్గురిని వారం పాటూ కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా వారిని చైన్నెలోని పురసైవాక్కంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తీసుకువచ్చి తీవ్రంగా విచారణ చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో..
– తండ్రిని హత్య చేసి శవాన్ని
కావేరి నదిలో పడేసిన కుమారుడు
తిరువొత్తియూరు: తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరు కావేరిపురం గ్రామం కోటయూర్ పడవ రేవులో ఓ వృద్ధుడి మృతదేహం కావేరి నదిలో తేలియాడుతూ కనిపించింది. రేవులో స్నానం చేస్తున్న స్థానికులు ఈ విషయాన్ని గురించి కొలత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కావేరి నది నుంచి వృద్ధుడి శవాన్ని వెలికితీసి విచారణ జరిపారు. విచారణలో మృతుడు కర్ణాటక రాష్ట్రం మాదేశ్వరన్ మలై పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగప్పాడి ప్రాంతానికి చెందిన వయ్యాపురి ( 60) అని తెలిసింది. వయ్యాపురికి, అతని కుమారుడు శంకరన్ (35)కి తరచుగా గొడవలు జరుగుతుండేవని, దీంతో శంకరన్ తన తండ్రి వయ్యాపురిని కొట్టి చంపి, ఎవరికీ తెలియకుండా శవాన్ని కావేరి నదిలో పడేసినట్లు తెలిసింది. దీంతో కొలత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శంకరన్‌ను అరెస్టు చేశారు. అలాగే వయ్యాపురి శవాన్ని కర్ణాటక పోలీసులకు అప్పగించారు.
వాకథాన్
సాక్షి, చైన్నె : వన్ వాక్ వన్ హోప్ నినాదంతో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన వాక్ థాన్ 2025 కార్యక్రమం ఆదివారం ఐలాండ్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగింది. రోటరీ డిస్ట్రిక్ట్ సహకారంతో క్యాన్సర్ సపోర్ట్ థెరపీ టూ ఓవర్ కమ్ పెయిన్ నినాదాన్ని హోరెత్తించే విధంగా జరిగిన ఈవాక్ థాన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, సినీ నటి సంచిత శెట్టి, జిల్లా గవర్నర్ ఆర్జీఎన్ వినోద్ సరోగి, నిర్వాహకులు సురేష్ డి జైన్, ఎన్‌ఎస్ శరవణన్, జె. శ్రీధర్, విజయ భారతి రంగరాజన్ హాజరయ్యారు. ఈ వాక్‌థాన్‌కు తరలి వచ్చిన వారికి జెర్సీలను అందజేశారు.
అవగాహన డ్రైవ్
సాక్షి, చైన్నె : ఎముకలలో సాంద్రత తగ్గడం, బలహీనత, ఊబకాయం వలన కలిగే వ్యాధులపై అవగాహన డ్రైవ్ ఆదివారం జరిగింది. దీనిని చైన్నెలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోడంబాక్కం శాఖ అధ్యుడు ఎస్‌ఎస్‌కే సందీప్, కార్యదర్శిప్రియా కన్నన్, డాక్టర్‌మీనాక్షి సుందరం, ఇతర వైద్యుల బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తమిళ బంగారాలకు సత్కారం
తమిళ బంగారాలకు సత్కారం


